Siraj: రోటీ చేస్తుండగా చేతులు కాలాయి.. నాలుగేళ్ల కిందటే క్రికెట్‌ను వదిలేద్దామనుకున్నా: బర్త్‌డే బాయ్ సిరాజ్‌

టీమ్‌ఇండియా పేసర్ సిరాజ్‌ హైదరాబాద్‌కు వచ్చాడు. ఇవాళ అతడి 30వ బర్త్‌డే. ఈ సందర్భంగా బీసీసీఐ పోస్టు చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Updated : 13 Mar 2024 14:03 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా పేసర్, హైదరాబాదీ మహమ్మద్ సిరాజ్‌ (Siraj) ఇవాళ 30వ సంవత్సరంలోకి అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా బీసీసీఐ (BCCI) అతడికి శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. హైదరాబాద్‌లో తొలిసారి ఆడిన మైదానం వద్దకు వెళ్తే ఎంతో హాయిగా ఉంటుందని సిరాజ్‌ వ్యాఖ్యానించాడు. అలాగే నాలుగేళ్ల కిందటే క్రికెట్‌ను వదిలేద్దామని భావించినట్లు కూడా సిరాజ్‌ చెప్పాడు. బీసీసీఐ పోస్టు చేసిన ఆ వీడియో వైరల్‌గా మారింది. 

‘‘మళ్లీ నా మాతృభూమి హైదరాబాద్‌కు వచ్చా. నేరుగా ఇంటికి వెళ్లి.. అక్కడి నుంచి ఈద్గా వెళ్తా. నేను ప్రపంచంలో ఎక్కడి వెళ్లినా రాని ప్రశాంతత ఈద్గాకు వెళ్తే వచ్చేస్తుంది. తొలిసారి నేను క్రికెటర్‌గా అక్కడే అడుగు పెట్టా. తొలినాళ్లలో క్యాటరింగ్‌ పనులు చేశా. మా నాన్న ఆటో రిక్షాతో కుటుంబాన్ని పోషించేవారు. దీంతో నేను ఆయనకు సాయంగా ఉండాలనుకున్నా. మా ఇంట్లో వాళ్లు చదువుకోమని గట్టిగా చెప్పారు. కానీ, నాకేమో క్రికెట్‌ అంటే చాలా ఇష్టం.  పని చేస్తూ 200 సంపాదించినా సంతోషపడేవాడిని. అందులో 50 రూపాయలు ఉంచుకుని.. మిగతావి ఇంట్లో ఇచ్చేవాడిని. అయితే, ఓసారి రోమాలీ రోటీ చేస్తుంటే చేతులు కాలాయి. ఇలాంటి కష్టాలను ఎదుర్కొని ఇక్కడి వరకు రాగలిగా. 

తొలి నాళ్లలో టెన్నిస్‌ క్రికెట్ ఎక్కువగా ఆడేవాడిని. అదే నాకు ఎంతో సాయం చేసింది. పేస్‌ను మెరుగుపర్చుకునేందుకు ఉపయోగపడింది.  కఠినంగా శ్రమిస్తే తప్పకుండా ఫలితం దక్కుతుంది. అది వెంటనే రాకపోయినా.. కష్టపడుతూనే ఉండాలి. ఏదొక రోజు మంచి జరుగుతుంది. ఇదే నమ్మి ఆచరించా. నాలుగేళ్ల కిందట నేను క్రికెట్‌ను వదిలేద్దామని ఓ దశలో భావించా. విజయవంతం కాకపోతే అదే నాకు చివరి సంవత్సరం అనుకున్నా. కానీ, తర్వాత ఫామ్‌లోకి రావడంతో జట్టులో స్థానం నిలబెట్టుకోగలిగా ’’ అని సిరాజ్‌ తెలిపాడు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌ ఆడిన సిరాజ్‌.. మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్‌ 2024 సీజన్‌లో ఆడనున్నాడు. ఆర్సీబీ తరఫున బరిలోకి దిగుతాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు