PCB: ధోనీ ఆడుతున్నాడుగా.. మరి పీసీబీకి ఏమైంది: పాక్‌ బోర్డుపై విమర్శలు

ఆసియా కప్‌ టోర్నీలో ఫైనల్‌ వరకు వెళ్లిన పాకిస్థాన్‌ జట్టు చివరి మ్యాచ్‌లో ఓటమిపాలైంది. ప్రస్తుతం పాక్‌ జట్టు స్వదేశంలో ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌ ఆడుతోంది..........

Published : 27 Sep 2022 01:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఆసియా కప్‌ టోర్నీలో ఫైనల్‌ వరకు వెళ్లిన పాకిస్థాన్‌ జట్టు చివరి మ్యాచ్‌లో ఓటమిపాలైంది. ప్రస్తుతం పాక్‌ జట్టు స్వదేశంలో ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌ ఆడుతోంది. ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియాలో జరగబోయే ప్రపంచకప్‌ మెగా టోర్నీ కోసం పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)  కొద్దిరోజుల క్రితమే తమ జట్టును ప్రకటించింది. అయితే, సీనియర్‌ ప్లేయర్‌ షోయబ్‌ మాలిక్‌ను వరల్డ్‌కప్‌కి ఎంపిక చేయకపోవడాన్ని మాజీ బ్యాటర్‌ కమ్రాన్‌ అక్మల్‌ తప్పుబట్టాడు. ఎంపిక ప్రక్రియను నిందిస్తూ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు గుప్పించాడు. ఈ సందర్భంగా ఎంఎస్‌ ధోనీ ప్రస్తావన కూడా తీసుకొచ్చాడు.

‘జట్టు సభ్యులపై ఇష్టాయిష్టాల గురించి గత నాలుగైదు ఏళ్లుగా మాట్లాడుతున్నా. దేశవాళీ క్రికెట్‌లోనూ అదే జరుగుతోంది. ఇలాంటివి సర్వసాధారణంగా మారడంతో పాకిస్థాన్ క్రికెట్‌కు నష్టం వాటిల్లుతోంది. మేం ఆడే రోజుల్లో ఈ తరహాసంస్కృతి లేదు. సంబంధిత సెలక్టర్లు ఉత్తమ క్రీడాకారులను ఎంపిక చేయాల్సిన అవసరం ఉంది’ అంటూ వ్యాఖ్యానించాడు. సీనియర్‌ అయినా జూనియర్‌ అయినా.. ఆటను దృష్టిలో ఉంచుకొనే ఏ ఆటగాడినైనా ఎంపిక చేయాల్సిన అవసరం ఉందని ఈ మాజీ వికెట్ కీపర్ అభిప్రాయపడ్డాడు.

దేశవాళీ క్రికెట్‌లో సీనియర్ ఆటగాళ్లు తప్పనిసరిగా భాగమయ్యేలా పీసీబీ చైర్మన్ రమీజ్ రజా దృష్టిసారించాలని సూచించాడు. సీనియర్లకు చోటుకల్పించాలని కోరాడు. ‘ఓ క్రికెటర్‌ విలువ రమీజ్ రాజాకు తెలిసుండాలి. జాతీయ టీ20 సిరీసుల్లో 5000 పరుగులు చేసిన వారు రెండో ప్లేయింగ్‌ ఎలెవన్‌లో ఉన్నారు. ఆటగాళ్లు జాతీయ జట్టులోకి ప్రవేశించలేకపోతే, వారు కూడా దేశీయంగా ఆడకూడదా? ఎంఎస్‌ ధోనీ భారతీయ టీ20 లీగ్‌ ఆడుతున్నాడు. అలిస్టర్ కుక్‌ (ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాడు) 2018లోనే రిటైర్‌ అయినా ఇప్పటికీ దేశవాళీ క్రికెట్‌లో పరుగులు చేస్తున్నాడు’ అని అన్నాడు. కానీ ఇక్కడ మాత్రం వయసు గురించి చర్చించుకుంటున్నారంటూ పీసీబీపై మండిపడ్డాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని