2011 World Cup: ‘రోహిత్‌ శర్మను 2011 ప్రపంచకప్‌నకు ఎంపిక చేద్దామనుకున్నాం.. ధోనీ వద్దన్నాడు’

2011 వన్డే ప్రపంచకప్‌ జట్టులో రోహిత్‌ శర్మ (Rohit Sharma)కు చోటు దక్కకపోవడానికి గల కారణాన్ని అప్పటి సెలక్టర్‌ రాజావెంకట్‌ (Raja Venkat) బయటపెట్టాడు.

Published : 22 Aug 2023 17:04 IST

ఇంటర్నెట్ డెస్క్: మహేంద్రసింగ్‌ ధోనీ (MS Dhoni) సారథ్యంలో టీమ్‌ఇండియా 2011 వన్డే ప్రపంచకప్‌ (2011 World Cup)ను సాధించిన సంగతి తెలిసిందే. భారత్ రెండోసారి విశ్వవిజేతగా నిలవడంలో సచిన్ తెందూల్కర్‌, యువరాజ్ సింగ్, గంభీర్, ధోనీ కీలకపాత్ర పోషించారు. అప్పుడు యువ ఆటగాడిగా ఉన్న విరాట్ కోహ్లీ కూడా తనవంతు కృషి చేశాడు. అయితే, కోహ్లీ కంటే ముందు జాతీయ జట్టులోకి వచ్చిన రోహిత్‌ శర్మ (Rohit Sharma)కు 2011 ప్రపంచకప్‌ జట్టులో చోటుదక్కలేదు. తాను ఆ ప్రపంచకప్‌ టీమ్‌లో భాగస్వామిని కాలేకపోయినందుకు చాలా బాధపడ్డానని రోహిత్‌ గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశంపై 2008-2012 మధ్య టీమ్‌ఇండియా సెలక్షన్‌ ప్యానల్‌లో ఉన్న రాజావెంకట్ (Raja Venkat) ఓ క్రీడాఛానెల్‌తో మాట్లాడాడు. రోహిత్‌ శర్మను జట్టులోకి తీసుకోవాలనుకున్నప్పటికీ కెప్టెన్ ధోనీ.. పీయూష్‌ చావ్లా వైపు మొగ్గుచూపాడని మాజీ సెలక్టర్ వ్యాఖ్యానించాడు. 

ఆ ఐదు సిక్స్‌లు నా జీవితాన్ని మార్చేశాయి: రింకూ సింగ్

‘‘ప్రపంచకప్‌ జట్టు ప్రణాళికల్లో రోహిత్ శర్మ పేరును మేం పరిగణనలోకి తీసుకున్నాం. అప్పుడు టీమ్‌ఇండియా..  దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్నందున యశ్‌పాల్ శర్మ (సెలక్టర్‌), నేనూ సౌతాఫ్రికాలో ఉన్నాం. మిగిలిన ముగ్గురు సెలక్టర్లు కృష్ణమాచారి శ్రీకాంత్, సురేంద్ర భవే, నరేంద్ర హిర్వాణి చెన్నైలో ఉన్నారు. జట్టులో 15 మందికి చోటివ్వాలి. 1 నుంచి 14 స్థానాల వరకు ఎంపిక చేసిన ఆటగాళ్లకు సెలక్షన్‌ కమిటీ ఆమోదం తెలిపింది. 15వ ఆటగాడిగా మేం రోహిత్ శర్మ పేరును సూచించాం. కోచ్ గ్యారీ కిర్‌స్టన్ కూడా దీనిని సమర్థించాడు. కానీ, కెప్టెన్ ధోనీ ఇందుకు అంగీకరించలేదు. రోహిత్‌కు బదులుగా పీయూష్ చావ్లాను జట్టులోకి తీసుకోవాలకున్నాడు. వెంటనే గ్యారీ కిర్‌స్టెన్ యూటర్న్‌ తీసుకుని చావ్లా వైపు మొగ్గుచూపాడు. అలా రోహిత్‌ శర్మకు ప్రపంచకప్‌నకు దూరమయ్యాడు’’ అని మాజీ సెలక్టర్ వెల్లడించాడు. 2011 ప్రపంచకప్‌లో పీయూష్‌ చావ్లా మూడు మ్యాచ్‌లు ఆడి నాలుగు వికెట్లు పడగొట్టాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని