Rinku Singh: ఆ ఐదు సిక్స్‌లు నా జీవితాన్ని మార్చేశాయి: రింకూ సింగ్

ఐపీఎల్‌ (IPL 2023)లో గుజరాత్ టైటాన్స్‌పై చివరి ఓవర్‌లో ఐదు సిక్స్‌లు తన జీవితాన్ని మార్చేశాయని రింకూ సింగ్ (Rinku Singh) పేర్కొన్నాడు.

Published : 22 Aug 2023 13:23 IST

ఇంటర్నెట్ డెస్క్: రింకూ సింగ్ (Rinku Singh) ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున అదరగొట్టి ఐర్లాండ్‌ (IRE vs IND)తో టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. వచ్చిన అవకాశాన్ని  ఈ యువ ఆటగాడు సద్వినియోగం చేసుకున్నాడు. బ్యాటింగ్‌ చేసే అవకాశం వచ్చిన మొదటి మ్యాచ్‌లోనే (ఐర్లాండ్‌తో రెండో టీ20) రింకూ తన సత్తా చాటాడు. మొదటి 15 బంతుల్లో 15 పరుగులే చేసిన అతడు.. చివరి రెండు ఓవర్లలో గేర్లు మార్చి జట్టుకు భారీ స్కోరునందించాడు. మొత్తం 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 38 పరుగులు చేసి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. మ్యాచ్‌ అనంతరం రింకూ సింగ్‌ను భారత స్పిన్నర్‌ రవిబిష్ణోయ్‌ ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌పై చివరి ఓవర్‌లో వరుసగా ఐదు సిక్స్‌లు బాదిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. ఆ ఐదు సిక్స్‌లు తన జీవితాన్ని మార్చేశాయని రింకూ సింగ్ పేర్కొన్నాడు.

మనోడు ఎక్కడిదాకా?

‘‘మొదటి మ్యాచ్‌లో బ్యాటింగ్ చేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నా. కానీ అవకాశం రాలేదు. రెండో టీ20లో బ్యాటింగ్‌ చేసే ఛాన్స్‌ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నా. ఐపీఎల్‌లో ఆడినట్లుగానే చివరి వరకు ఆడాలని అనుకున్నాను. ప్రశాంతంగా ఉంటూ చివరి 2-3 ఓవర్లు హిట్టింగ్‌ చేయాలని ప్రణాళిక వేసుకున్నా. ఐదు సిక్సర్లు (ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌పై) నా జీవితాన్ని మార్చేశాయి. ఆ ఇన్నింగ్స్‌ నుంచే నాకు గుర్తింపు వచ్చింది. అభిమానులు స్టాండ్స్‌ నుంచి ‘రింకూ.. రింకూ’ అని ఉత్సాహపరచడాన్ని  ఇష్టపడతా’’ అని రింకూ సింగ్‌ ఆ వీడియోలో వివరించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తాజాగా తన ట్విటర్‌ (X) ఖాతాలో పోస్టు చేసింది.

2023 ఐపీఎల్‌ సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రింకూ సింగ్ చివరి ఓవర్‌లో వరుసగా ఐదు సిక్స్‌లు బాది జట్టును గెలిపించి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. తర్వాతి మ్యాచ్‌ల్లో కూడా రింకూ దూకుడు కొనసాగింది. తద్వారా జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఐర్లాండ్‌తో మూడో టీ20 బుధవారం జరగనుంది. మూడు టీ20ల సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు