Team India - WC 2023: తిలక్‌కు కలిసి రావొచ్చు.. ఫిట్‌నెస్‌ కీలకం.. నాలుగులో సూర్య!

వన్డే ప్రపంచ కప్‌ కోసం ప్రకటించే జట్టులో ఎవరు ఉంటారు..? యువకులకు అవకాశం వస్తుందా..? దాయాదుల మధ్య పోరులో ఎవరిది ఆధిక్యం? వంటి విషయాలపై మాజీ, ప్రస్తుత క్రికెటర్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు. 

Updated : 11 Aug 2023 11:06 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్‌ఇండియా యువ ఆటగాడు తిలక్‌ వర్మ వెస్టిండీస్‌ పర్యటనలో అదరొట్టేస్తున్నాడు. టీ20ల్లో అరంగేట్రం చేసిన వర్మ ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచుల్లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. దీంతో వచ్చే ప్రపంచకప్‌లో అతడికి మిడిలార్డర్‌లో చోటు ఇవ్వాలనే డిమాండ్లూ వస్తున్నాయి. ఎడమ చేతివాటం కలిగిన తిలక్‌ దూకుడుగా ఆడటంలో రాటుదేలుతున్నాడు. ఈ క్రమంలో బీసీసీఐ మాజీ చీఫ్‌ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచకప్‌ స్క్వాడ్‌లోకి వచ్చే అవకాశాలు తిలక్‌ వర్మకు ఉన్నట్లు పేర్కొన్నాడు.

ముందు బ్యాటర్‌.. తర్వాతే కెప్టెన్‌

‘‘మిడిలార్డర్‌లో ఆడే శ్రేయస్‌ అయ్యర్ ఫిట్‌గా ఉన్నాడా..? లేదా అనేది తెలియదు. ఒకవేళ అతడు ఫిట్‌గా లేకుండా వరల్డ్‌ కప్‌ నుంచి వైదొలిగితే ఆ స్థానం కోసం సరైన వ్యక్తిగా తిలక్‌ వర్మను పరిగణనలోకి తీసుకొనేందుకు అవకాశం ఉంది. బహుముఖ ప్రజ్ఞే అతడికి ఛాన్స్‌ వచ్చేలా చేస్తుంది. ఫాస్ట్‌, స్పిన్‌ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోగలిగే సత్తా ఉంది. పరిస్థితులకు తగ్గట్టుగా ఇన్నింగ్స్‌లో వేగం తీసుకురాగలడు. టాప్‌ - 4లో ఎడమచేతివాటం బ్యాటర్‌ లేకపోవడం కూడా అతడికి కలిసిరావొచ్చు. స్ట్రైక్‌ను రొటేట్‌ చేస్తూ ఆసీస్‌ దిగ్గజం మైకెల్‌ బెవాన్‌లా కీలక ఇన్నింగ్స్‌లు ఆడగలడని భావిస్తున్నా’’ అని ప్రసాద్‌ తెలిపాడు. 


సూర్యకుమార్‌కు నాలుగో స్థానం బాగుంటుంది: శిఖర్

వరల్డ్‌ కప్‌ జట్టులో తనకు స్థానం వస్తుందో లేదో అనే దాని గురించి ఆలోచించడం లేదని శిఖర్ ధావన్‌ వ్యాఖ్యానించాడు. అయితే, ఆసియా గేమ్స్‌ కోసం తనను ఎంపిక చేస్తారని భావించినా.. చోటు దక్కకపోవడంతో ఆశ్చర్యానికి గురైనట్లు పేర్కొన్నాడు. అలాగే ప్రపంచకప్‌లో నాలుగో స్థానంపైనా తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. ‘‘భారత్‌కు గొప్ప అవకాశాలు ఉన్నాయి. అనుభవం, యువతరంతో కూడిన జట్టు బరిలోకి దిగనుంది. స్వదేశంలో జరగనుండటం కూడా టీమ్‌ఇండియాకు కలిసొస్తుంది. కీలకమైన నాలుగో స్థానంలో సూర్యకుమార్‌ ఆడితే బాగుంటుంది. అతడు ఇక్కడ ఫిట్‌ అయిపోతాడు’’ అని ధావన్‌  తెలిపాడు.


భారత్‌ ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ అత్యుత్తమంగా లేదు: అకిబ్‌ జావెద్

వన్డే ప్రపంచకప్‌లో వారి సొంతగడ్డపై టీమ్‌ఇండియాను ఓడించే అవకాశాలు తమ జట్టుకు ఉన్నాయని పాక్ మాజీ బౌలర్ అకిబ్ జావెద్ వ్యాఖ్యానించాడు. ‘‘పాక్ జట్టు సమతూకంగా ఉంది. భారత్‌లో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. కానీ, ఎక్కువగా ఫిట్‌నెస్‌ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వారి ఫామ్‌ కూడా అత్యున్నత స్థాయికి తగ్గట్టుగా లేదు. కొత్త ఆటగాళ్లను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టే పాక్‌కు భారత్‌ను ఓడించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి’’ అని జావెద్ వ్యాఖ్యానించాడు. 


వారినే గుర్తు పెట్టుకుంటారు.. : డారెన్ సామీ

ఐసీసీ ట్రోఫీ కోసం భారత్ పదేళ్ల నుంచి నిరీక్షిస్తోంది. నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ కీలక సమయంలో విఫలం కావడంతో విజేతగా నిలవలేపోతోంది. ఈ క్రమంలో భారత యువ ఆటగాళ్లను ఉద్దేశించి విండీస్‌ మాజీ కెప్టెన్ డారెన్ సామీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘యశస్వి జైస్వాల్, హార్దిక్‌ పాండ్య, తిలక్ వర్మ, శుభ్‌మన్‌ గిల్.. ఇలా టాలెంటెడ్‌ ఆటగాళ్లను భారత్‌ తయారు చేయగలుగుతోంది. కానీ, ఎవరైతే ఐసీసీ ట్రోఫీని అందించగలుగుతారో వారినే అభిమానులు గుర్తు పెట్టుకుంటారు. దేశవాళీ క్రికెట్‌లో అదరగొట్టి జాతీయ జట్టులోకి అరంగేట్రం చేసిన యశస్వి జైస్వాల్ తొలి టెస్టులోనే భారీ శతకం సాధించాడు. ఇదంతా డొమిస్టిక్‌ క్రికెట్‌ ప్రమాణాలను తెలియజేస్తోంది. అక్కడ బాగా ఆడితే జాతీయ జట్టులోకి వచ్చేందుకు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి’’ అని సామీ వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని