Rohit Sharma on ODI World cup: ముందు బ్యాటర్‌.. తర్వాతే కెప్టెన్‌

కెప్టెన్‌గా కంటే బ్యాటర్‌గానే భారత జట్టులో తన పాత్ర కీలకమని రోహిత్‌ శర్మ అన్నాడు. గత రెండేళ్లలో వివిధ ఫార్మాట్లలో సారథ్య బాధ్యతలు నిర్వర్తించిన అతను.. అక్టోబరులో సొంతగడ్డపై మొదలయ్యే ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్‌లోనూ జట్టును నడిపించబోతున్నాడు.

Updated : 11 Aug 2023 11:04 IST

ఎవరి స్థానానికీ గ్యారెంటీ లేదు
తిలక్‌లో గొప్ప పరిణతి ఉంది
టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ
ముంబయి

కెప్టెన్‌గా కంటే బ్యాటర్‌గానే భారత జట్టులో తన పాత్ర కీలకమని రోహిత్‌ శర్మ అన్నాడు. గత రెండేళ్లలో వివిధ ఫార్మాట్లలో సారథ్య బాధ్యతలు నిర్వర్తించిన అతను.. అక్టోబరులో సొంతగడ్డపై మొదలయ్యే ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్‌లోనూ జట్టును నడిపించబోతున్నాడు. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా సన్నాహాలు, ఆటగాళ్ల గాయాలు, సెలక్షన్‌ తదితర విషయాలపై రోహిత్‌ మీడియాతో మాట్లాడాడు. ఆ విశేషాలు అతడి మాటల్లోనే..

నా తొలి ప్రాధాన్యం బ్యాటింగ్‌కే. దాని తర్వాతే కెప్టెన్సీ. జట్టులో నా పాత్ర ప్రధానంగా బ్యాటర్‌గానే. ముందు భారీ స్కోర్లు సాధించి జట్టును గెలిపించడమే లక్ష్యం. దాంతో పాటు నాయకత్వ బాధ్యతలు కూడా సమర్థంగా నిర్వర్తించాలి. ప్రపంచకప్‌లో జట్టును నడిపించడం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా.

కసితో ఉన్నారు: నేనింత వరకు వన్డే ప్రపంచకప్‌ను అందుకోలేదు. అది నాకొక కల. దాని కోసం పోరాడటం నాకెంతో ఆనందాన్నిస్తుంది. ప్రపంచకప్‌ అంటే పళ్లెంలో తెచ్చి పెట్టి ఇవ్వరు. అందుకోసం చాలా కష్టపడాలి. 2011లో ప్రపంచకప్‌ గెలిచిన దగ్గర్నుంచి మా జట్టు మళ్లీ ఆ కప్పును మరోసారి అందుకునేందుకు శ్రమిస్తోంది. ప్రతి ఒక్కరూ ట్రోఫీ కోసం కసితో ఉన్నారు. మాకు మంచి జట్టుంది. మేమందరం మెరుగైన ఆటగాళ్లం. ఇది సాధించగలమన్న ఆత్మవిశ్వాసం, నమ్మకం మాలో ఉన్నాయి.

మేమిద్దరమే కాదు: మా ఆటగాళ్లు కొందరికి ఫిట్‌నెస్‌ సమస్యలున్నాయి. గత ఏడాది టీ20 ప్రపంచకప్‌కు ముందు వన్డేలు ఆడటం తగ్గించాం. ఇప్పుడు వన్డే ప్రపంచకప్‌ నేపథ్యంలో చాలామంది టీ20లు ఆడట్లేదు. ప్రపంచకప్‌కు ముందు ప్రతి మ్యాచ్‌ ఆడేయకూడదు. రెండేళ్ల ముందే ఈ విషయంలో ప్రణాళికలు వేసుకున్నాం. నేను, కోహ్లి టీ20లు ఆడకపోవడం గురించి అందరూ అడుగుతున్నారు. కానీ జడేజా కూడా టీ20లు ఆడట్లేదు. అతణ్ని అడగరేం? ప్రపంచకప్‌ సంవత్సరంలో ఆటగాళ్లందరూ తాజాగా ఉండేలా చూస్తున్నాం. ఇప్పటికే మా జట్టులో చాలామందికి గాయాలయ్యాయి. ఇప్పుడు కూడా గాయాల భయం వెంటాడుతోంది. అందుకే ఏమాత్రం అవకాశం ఉన్నా ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చే ప్రయత్నం చేస్తున్నాం. బీసీసీఐతో కూడా ఈ విషయం మాట్లాడాం.

అందుకే సూర్యకు అవకాశాలు: సూర్యకుమార్‌ యాదవ్‌ వన్డేల్లో మెరుగయ్యేందుకు బాగా కష్టపడుతున్నాడు. ఈ ఫార్మాట్లో ఎక్కువ అనుభవం ఉన్న వారితో మాట్లాడుతున్నాడు. అందుకు తగ్గ దృక్పథం అలవరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అలాంటి ఆటగాడికి వీలైనన్ని ఎక్కువ అవకాశాలు ఇచ్చి ఆత్మవిశ్వాసం పెంచడానికి చూడాలి. ఐపీఎల్‌లో ఈ ఏడాది కొన్ని మ్యాచ్‌ల్లో అతను పెద్దగా పరుగులు సాధించలేదు. కానీ తర్వాత ఎలా ఆడాడో అందరూ చూశారు. ‘రెండు మూడు మ్యాచ్‌ల్లో విఫలమైనా పర్వాలేదు, నువ్వు నిలదొక్కుకుంటే జట్టును గెలిపించగలవు’.. అంటూ అతడిలో ఆత్మవిశ్వాసం పెంచడానికి చూస్తున్నాం.

ఆ స్థానం సమస్యే: వన్డేల్లో నాలుగో స్థానం విషయంలో సమస్య చాన్నాళ్లుగా ఉంది. యువరాజ్‌ సింగ్‌ తర్వాత ఎవ్వరూ ఆ స్థానంలో నిలదొక్కుకోలేదు. ఇది చాలా సుదీర్ఘ కాలం. ఆ స్థానంలో శ్రేయస్‌ కొన్నాళ్లు బాగా ఆడాడు. తన గణాంకాలు కూడా బాగున్నాయి. దురదృష్టవశాత్తూ గాయాలు అతణ్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఆ స్థానంలో ఆడిన మరికొందరు ఆటగాళ్లకు కూడా గాయాలయ్యాయి. చాలామంది వచ్చారు.. వెళ్లారు. నిలదొక్కుకోలేకపోయారు.

చాలా పేర్లున్నాయి: జట్టులో ఎప్పుడూ ఎవరి స్థానాలకూ గ్యారెంటీ ఉండదు. చివరికి నా విషయంలోనూ అంతే. శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌లకు పెద్ద గాయాలే అయ్యాయి. శస్త్రచికిత్సలు జరిగాయి. నాలుగు నెలల పాటు ఆటకు దూరంగా ఉన్నారు. ఇలాంటి స్థితి నుంచి పునరాగమనం చేయడం తేలిక కాదు. మరి వాళ్లెలా స్పందిస్తారో చూడాలి. ఆసియా కప్‌ కోసం జట్టు ఎంపిక కొన్ని రోజుల్లో జరుగుతుంది. జట్టులో ప్రతి స్థానం కోసం గట్టి పోటీ ఉంటుంది. ఎవరికీ అంత తేలిగ్గా చోటు దక్కదు. చాలా పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మాకు కలిసొచ్చే కూర్పేదో చూసుకుని ఆటగాళ్లను ఎంచుకుంటాం.


అతను రుజువు చేసుకున్నాడు

తిలక్‌ వర్మ నమ్మదగ్గ ఆటగాడిలా కనిపిస్తున్నాడు. రెండేళ్లుగా తన ఆటను చూస్తున్నా. ఆట పట్ల తనకు కసి ఉంది. అదే అన్నింటికంటే ముఖ్యమైన విషయం. ఆ వయసులో అంత పరిణతితో ఆడటం అరుదైన విషయం. తన బ్యాటింగ్‌ చూడముచ్చటగా ఉంటుంది. ఏ స్థితిలో ఎలా ఆడాలో, ఎప్పుడు షాట్లు కొట్టాలో తనకు బాగా తెలుసు. ఇప్పటికైతే తిలక్‌ గురించి ఇంతే చెప్పగలను. ప్రపంచకప్‌ సంగతి నాకు తెలియదు. తిలక్‌ ప్రతిభావంతుడనే విషయం ఇప్పటిదాకా ఆడిన కొన్ని మ్యాచ్‌ల్లోనే రుజువైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని