Mumbai : సగం మంది కుర్రాళ్లే.. ఇక భారమంతా వారిపైనే!

ప్రతిసారీ ఐపీఎల్ సీజన్‌ వచ్చినప్పుడల్లా కప్‌ ఎవరి సొంతం చేసుకుంటారనే...

Updated : 26 Mar 2022 14:36 IST

ఐదుసార్లు ఛాంపియన్‌.. అత్యంత ఖరీదైన ఫ్రాంచైజీ.. అంబానీల సొంతం... ఇంకేమీ చెప్పనవసరం లేదేమో.. ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా ఆ జట్టేమిటో.. ముంబయి.. అన్ని ఫార్మాట్లలో టీమ్‌ఇండియాను నడిపిస్తోన్న రోహిత్ శర్మనే వరుసగా ఎనిమిదో ఏడాది ముంబయికి నాయకత్వం వహిస్తున్నాడు. అయితే గతేడాది లీగ్‌ స్టేజ్‌కే పరిమితమైన ముంబయిని.. టీమ్‌ఇండియా కెప్టెన్సీ ఉత్తేజంలో ఉన్న రోహిత్‌ ఈ సారి ఎలా నడిపిస్తాడనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది..

ప్రతిసారీ కొత్త సీజన్‌ వచ్చినప్పుడల్లా కప్‌ ఎవరి సొంతం చేసుకుంటారనే చర్చ రావడం సర్వసాధారణం.. అయితే అది ముంబయి, చెన్నై మధ్యే ఆగిపోతుంది. 2018 నుంచి పరిశీలిస్తే ఇది నిజమేనేమో అనేలా ఉన్నాయి గణాంకాలు. గత నాలుగు సీజన్లలో రెండేసి సార్లు ముంబయి (2019,2020), చెన్నై (2018,2021)  టైటిల్స్‌ను నెగ్గాయి. ఈ సారి ముంబయి జట్టులో మార్పులు చోటు చేసుకున్నా.. కీలక ఆటగాళ్లు ఉండటం,  పోటీలు జరిగేది ముంబయి, పుణెలోనే కావడం కలిసొచ్చే అంశమే.

జట్టులో కీలక ప్లేయర్లు వీరే..

ముంబయి అనగానే రోహిత్ శర్మ గుర్తుకొస్తాడు. రోహిత్‌తోపాటు కీరన్‌ పొలార్డ్, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలక ఆటగాళ్లు. మెగా వేలంలో ఇషాన్‌ను భారీ ధరకు దక్కించుకుంది. అలానే పేసర్లు జోఫ్రా ఆర్చర్, టైమల్ మిల్స్, జయ్‌దేవ్‌ ఉనద్కత్ ఉన్నారు. బ్యాటింగ్‌పరంగా చూసుకుంటే.. రోహిత్, ఇషాన్, సూర్యకుమార్‌, టిమ్‌ డేవిడ్, కీరన్‌ పొలార్డ్, ఫాబియన్‌ అలెన్‌ పరుగులు చేయగలరు. అయితే వీరిలో తొలి ముగ్గురు తప్పితే మిగతావారిపై పెద్దగా నమ్మకం ఉండకపోవచ్చు. జట్టులోని 25 మందిలో సగం మంది పెద్దగా తెలియని ఆటగాళ్లే. అయితే రంజీ సహా ఇతర దేశవాళీ టోర్నీల్లో రాణించడంతో ముంబయి వారిని కొనుగోలు చేసింది.

ఓపెనర్లు సరే.. మరి ఆల్‌ రౌండర్లు?

ఛాంపియన్‌కు ఓపెనింగ్‌ సమస్య లేదు. రోహిత్ శర్మతో ఇషాన్‌ కిషన్‌ ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తాడు. అయితే బ్యాకప్‌ ఓపెనర్ ఎవరనేది జట్టు యాజమాన్యం నిర్ణయించాల్సి ఉంటుంది. గత సీజన్‌లో ఆల్‌రౌండర్లు రాణించకపోవడంతో లీగ్ దశకే ముంబయి పరిమితం కావాల్సి  వచ్చింది. పాండ్య  సోదరులు, కీరన్‌ పొలార్డ్‌ విఫలం కావడం ముంబయికి దెబ్బ పడింది. అయితే ఈసారి పాండ్య బ్రదర్స్ లేరు. కీరన్‌ పొలార్డ్‌ కూడానూ పెద్దగా రాణించిందేమీ లేదు. ఏ క్షణంలోనైనా మ్యాచ్‌ను మలుపు తిప్పగల సత్తా పొలార్డ్‌కు ఉంది. జోఫ్రా ఆర్చర్‌ కూడా విలువైన పరుగులు చేయగలడు. అలానే ఫాబియన్‌ అలెన్ హార్డ్‌ హిట్టరే. ఇక ఆసీస్‌ ఆటగాడు డానియల్ సామ్స్‌ ఫాస్ట్‌ మీడియంతోపాటు బ్యాటింగ్‌ చేస్తాడు. అయితే విదేశీ ఆటగాళ్లు తుది జట్టులో నలుగురు మాత్రమే ఉండాలనే నిబంధన ఉంది.

బుమ్రా నేతృత్వంలో బౌలింగ్‌ దాడి 

టీమ్‌ఇండియా ప్రధాన పేస్‌ బౌలర్‌ బుమ్రా నేతృత్వంలోనే ముంబయి పేస్‌ బౌలింగ్‌ దళం ఉండబోతోంది. బుమ్రా కాకుండా జోఫ్రా ఆర్చర్, జయ్‌దేవ్‌ ఉనద్కత్, రీలే మెరెడిత్, మిల్స్‌, బసిల్ థంపి ఉన్నారు. అయితే స్పిన్ విభాగం కాస్త బలహీనంగా అనిపిస్తోంది. మురుగన్‌ అశ్విన్‌, అన్‌మోల్‌ ప్రీత్‌ సింగ్, డేవాల్డ్‌ బ్రెవిస్ ఉన్నప్పటికీ వీరిలో ఎవరికీనూ అంతర్జాతీయ అనుభవం లేకపోవడం గమనార్హం. అయితే తుది జట్టులో ఎవరు ఉంటారో తెలియాలంటే మ్యాచ్ వరకు ఆగాల్సిందే మరి. 

ఈసారైనా అర్జున్‌కి అవకాశం దక్కేనా?

గత సీజన్‌లో రూ. 20 లక్షలకు, ఈ సారి రూ. 30 లక్షలకు సొంతం చేసుకున్న క్రికెట్ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ కుమారుడు అర్జున్‌ తెందూల్కర్‌కు ఈ సారైనా మ్యాచ్‌ ఆడేందుకు అవకాశం దక్కుతుందో లేదో చూడాలి. 2020-21 సీజన్‌లో సయ్యద్ ముస్తాఖ్ అలీ ట్రోఫీలో ముంబయి తరఫున హరియాణా మీద అరంగేట్రం చేసిన అర్జున్ మూడు ఓవర్లలో 34 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్‌ను మాత్రమే తీశాడు. గత సీజన్‌ మొత్తం రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితమైన అర్జున్‌.. నెట్స్‌లో బౌలింగ్ చేశాడు. అయితే గాయం కారణంగా మధ్యలోనే తప్పుకొన్నాడు. ఇప్పుడు యువ క్రికెటర్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అర్జున్‌కు అవకాశం దక్కొచ్చని విశ్లేషకులు అంచనా వేశారు.

ముంబయి జట్టు : రోహిత్ శర్మ, అన్‌మోల్‌ సింగ్, డేవాల్డ్ బ్రెవిస్, రాహుల్ బుద్ది, సూర్యకుమార్‌ యాదవ్‌, ఆర్యన్ జుయల్, ఇషాన్‌ కిషన్‌, అర్జున్ తెందూల్కర్, డానియల్ సామ్స్, ఫాబియన్ అలెన్, హృతిక్‌ షోకీన్‌, జోఫ్రా ఆర్చర్, కీరన్‌ పొలార్డ్‌, మహమ్మద్‌ అర్షద్‌ ఖాన్, తిలక్‌ వర్మ, రమణ్‌దీప్‌ సింగ్, సంజయ్‌ యాదవ్‌, టిమ్‌ డేవిడ్, బసిల్‌ థంపి, బుమ్రా, జయ్‌దేవ్‌ ఉనద్కత్, మయాంక్‌ మార్కండే, మురుగన్‌ అశ్విన్‌, రిలే మెరెడిత్, మిల్స్‌ 

-ఇంటర్నెట్ డెస్క్, ప్రత్యేకం

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు