Rishabh Pant : పంత్‌ పిచ్చికీ ఓ లెక్క ఉంది : సంజయ్‌ మంజ్రేకర్

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా యువ ఆటగాడు రిషభ్ పంత్ డకౌట్ కావడంపై విమర్శలు వెల్లువెత్తాయి. సునీల్ గావస్కర్, గౌతం గంభీర్‌ వంటి మాజీ ఆటగాళ్లు...

Updated : 07 Jan 2022 20:14 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా యువ ఆటగాడు రిషభ్ పంత్ డకౌట్ కావడంపై విమర్శలు వెల్లువెత్తాయి. సునీల్ గావస్కర్, గౌతం గంభీర్‌ వంటి మాజీ ఆటగాళ్లు టెస్టు క్రికెట్‌ ఆడే పద్ధతి ఇది కాదని విమర్శించారు. తాజాగా, టీమ్‌ఇండియా హెడ్‌కోచ్‌ రాహుల్ ద్రవిడ్‌ కూడా ఈ విషయంపై స్పందిస్తూ.. పంత్‌తో మాట్లాడతామని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్‌.. రిషభ్‌ పంత్‌కి మద్దతుగా నిలిచాడు. పంత్‌ని తప్పు పట్టాల్సిన అవసరం లేదని అన్నాడు. దూకుడైన ఆటతీరుతోనే గత ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ పర్యటనల్లో జట్టుని గెలిపించాడని పేర్కొన్నాడు. అతడి పిచ్చికి కూడా ఓ లెక్కుందని చెప్పాడు. 

‘విరాట్‌ కోహ్లీ, ఛెతేశ్వర్‌ పుజారా లాంటి సీనియర్‌ ఆటగాళ్లు ఇలాంటి షాట్‌ ఆడి ఔటైతే.. తప్పు పట్టడంలో ఓ అర్థముంటుంది. కానీ, దూకుడుగా ఆడే రిషభ్‌ పంత్ ఆ షాట్‌ని ఎంచుకోవడంలో తప్పులేదు. అందులోనూ, అతడు ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్లో ఎదుగుతున్నాడు. గత విదేశీ పర్యటనల్లో కూడా ధాటిగా ఆడి జట్టుని విజయ తీరాలకు చేర్చాడు. తాజాగా, దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులోనూ తన సహజ శైలిలోనే ఆడాడు. అది ఆవేశంతోనో, నిర్లక్ష్యంగానో ఆడిన షాట్‌ కాదు. అంతకు ముందు కగిసో రబాడ రెండు షార్ట్‌ పిచ్ బంతులు వేయడంతో.. మూడో బంతి కచ్చితంగా ఫుల్ లెంగ్త్‌ వేస్తాడని పంత్ భావించి ఉంటాడు. అయితే, రబాడ మూడోసారి కూడా షార్ట్‌పిచ్ బంతి వేయడంతో పంత్‌ దాన్ని అంచనా వేయలేక ఔటయ్యాడు. ఒక వేళ ఆ బంతి బ్యాటుకి దొరికుంటే కచ్చితంగా బౌండరీకి తరలించేవాడు. అతడి బ్యాటింగ్ తీరే అలాంటిది. అతడి పిచ్చికి కూడా ఓ లెక్కుంది. పంత్ క్రీజులో నిలదొక్కుకుంటే.. ఎలా ఆడతాడో మనందరికీ తెలుసు. ఒంటి చేత్తో మ్యాచ్‌ ఫలితాన్నే మార్చగలడు. గొప్ప ఇన్నింగ్స్ ఆడినప్పుడు పొగిడినట్లే.. విఫలమైనప్పుడు కూడా మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉంది’ అని సంజయ్‌ మంజ్రేకర్‌ పేర్కొన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని