Tokyo Olympics: ఆగ్రహంతో రాకెట్‌ను విసిరికొట్టిన ప్రపంచ నం.1

నొవాక్‌ జకోవిచ్‌.. ఈ పేరు తెలియని క్రీడాభిమాని ఉండడు. టెన్నిస్‌లో అతనో యోధుడు. 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల విజేత.. మరొకటి సాధిస్తే దిగ్గజ రోజర్‌ ఫెదరర్‌, రఫెల్‌ నాదల్‌ను అధిగమించి....

Published : 02 Aug 2021 01:16 IST

టోక్యో: నొవాక్‌ జకోవిచ్‌.. ఈ పేరు తెలియని క్రీడాభిమాని ఉండడు. టెన్నిస్‌లో అతనో యోధుడు. 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల విజేత.. మరొకటి సాధిస్తే దిగ్గజ రోజర్‌ ఫెదరర్‌, రఫెల్‌ నాదల్‌ను అధిగమించి.. 21 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు సాధించిన ఏకైన ఆటగాడిగా చరిత్ర పుటల్లో తన పేరును లిఖించుకుంటాడు. కానీ ఈ సెర్బియా ఆటగాడికి ఒలింపిక్స్‌ స్వర్ణం అందని ద్రాక్షలాగే మిగిలింది. పోటీ పడ్డ ప్రతిసారి నిరాశ ఎదురవుతూనే వచ్చింది. విశ్వక్రీడల్లో ఇప్పటివరకు జకో ఒకే ఒక్క పతకం సాధించాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలుచుకున్నాడు.

టోక్యో ఒలింపిక్స్‌లోనైనా పసిడి సాధించి తన చిరకాల కాంక్షను నెరవేర్చుకోవాలనుకున్నాడు. సెమీస్‌కు చేరేవరకు గట్టి పట్టుదల కనబర్చాడు. అప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్‌లలో ఒక్క సెట్‌ను కూడా కోల్పోకుండా విజయం సాధించాడు. కానీ సెమీస్‌లో ప్రపంచ నం.1 భంగపాటుకు గురయ్యాడు. సెమీఫైనల్స్‌లో ఈ సెర్బియన్‌ ఆటగాడు జెర్మనీకి చెందిన అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ చేతిలో 1-6, 3-6, 6-1 తేడాతో ఓటమిపాలయ్యాడు. దీంతో అతడి స్వర్ణం కల చెదిరింది. కాంస్యంతోనైనా తిరిగి వెళ్లాలనుకున్న జకోకు మళ్లీ నిరాశే ఎదురైంది. శనివారం జరిగిన కాంస్య పోరులో స్పెయిన్‌ ఆటగాడు కారెన్‌ బుస్టా చేతిలో 4-6, 7-6(6), 3-6 తేడాతో పరాజయం పాలయ్యాడు. కనీసం కాంస్యం కూడా దక్కలేదన్న కోపమో ఏమో కానీ ఆ మ్యాచ్‌ అనంతరం అతడు సహనం కోల్పోయాడు. తన రాకెట్‌ను నెట్‌ పోల్‌కు విసిరికొట్టాడు. దీంతో ఆ రాకెట్‌ విరిగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పలువురు జకోకు మద్ధతు తెలుపుతుండగా.. మరికొందరు విభేదిస్తున్నారు. ప్రపంచ నం.1 ఆటగాడు ఇలా చేయాల్సిందికాదు అని అంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని