Shubman Gill: అండర్సన్‌తో వాగ్వాదం.. బయటకు వెల్లడించకపోవడమే బెటర్‌: గిల్

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో (IND vs ENG) శుభ్‌మన్‌ గిల్ సెంచరీతో అలరించాడు. భారత్ భారీ ఆధిక్యం సాధించడంలో అతడూ కీలక పాత్రే పోషించాడు.

Published : 08 Mar 2024 18:23 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత యువ బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్ (Shubman Gill) ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో రెండో సెంచరీ సాధించాడు. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో గిల్ 110 పరుగులు చేశాడు. అయితే, బ్యాటింగ్‌ సమయంలో ఇంగ్లాండ్‌ పేసర్ జేమ్స్‌ అండర్సన్‌తో స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ఇవాళ మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఆ ఘటనపై గిల్ స్పందించాడు. 

‘‘నేను ఎలా ఆడాలని మా నాన్న  కోరుకున్నారో.. అదే స్థాయిలో ప్రదర్శన చేయగలిగా. తప్పకుండా నా ఆట పట్ల ఆయన గర్వపడతారు. బంతిలో అనుకున్నంత మేర కదలిక లేదు.  బ్యాట్‌ మీదకు అస్సలు రాలేదు. ఇంగ్లాండ్‌ బౌలర్లపై ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉంది. అందుకే, కాస్త అడ్వాంటేజ్ తీసుకుని అండర్సన్‌ బౌలింగ్‌లో దూకుడు ప్రదర్శించా. ప్రతిసారీ మంచి ప్రదర్శనే ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటా. కొన్నిసార్లు భారీ స్కోర్లుగా మలచలేకపోవచ్చు. కానీ, నాణ్యమైన ఆటతీరును ప్రదర్శిస్తున్నాననే అనుకుంటా. ఇక అండర్సన్‌ బౌలింగ్‌లో సిక్స్‌ కొట్టిన తర్వాత జరిగిన చాటింగ్‌ గురించి మాట్లాడటం బాగోదు. మేం ఏం అనుకున్నామనేది బయటకు చెప్పకుండా ఉంటేనే మంచిది’’ అని గిల్ వ్యాఖ్యానించాడు. 

ఓపెనర్‌గానే రావాలి: లఖ్విందర్‌

ఏరికోరి ఆడుతున్న మూడో స్థానంలో కొన్ని ఇబ్బందులు పడినప్పటికీ కుదురుకుని గిల్ సత్తా చాటుతున్నాడు. అయితే, తన కుమారుడు ఓపెనర్‌గా వస్తేనే ఉత్తమమని గిల్ తండ్రి లఖ్విందర్‌ వ్యాఖ్యానించడం గమనార్హం. ‘‘అండర్ -16 రోజుల నుంచి గిల్ స్పిన్నర్లు, పేసర్ల బౌలింగ్‌లో ముందుకొచ్చి ఆడటం చేసేవాడు. దీనివల్ల వారిపై ఒత్తిడి పెరిగేది. కానీ, ఇటీవల మాత్రం అలా చేయడం లేదు. సహజసిద్ధమైన ఆటతీరును ప్రదర్శిస్తేనే పరుగులు చేయడం సులువు. అప్పుడే, ఆత్మవిశ్వాసంతో ఆడగలం. గిల్ స్క్వేర్‌ కట్, కవర్‌ డ్రైవ్‌తో కొట్టే షాట్లు బాగుంటాయి. ఇటీవలకాలంలో అతడు మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్నాడు. ఓపెనర్‌గా ఆడితే అత్యుత్తమ ఆటతీరు బయటకు వస్తుందని నమ్ముతా. నంబర్ 3లో ఒత్తిడి తారాస్థాయిలో ఉంటుంది. అతడి ఆట కూడా వన్‌డౌన్‌కు సరిపోదు. ఛెతేశ్వర్‌ పుజారా డిఫెన్సివ్‌తో బంతిని ఎదుర్కొంటాడు. అయితే, నేను సూచనలు చేసినప్పటికీ.. ఓ తండ్రిగా అతడు తీసుకునే నిర్ణయాలను గౌరవిస్తా. అందులో నేను అస్సలు కలగజేసుకోను’’ అని తెలిపాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు