టీమిండియా చెప్పిందంటే కంగారు పడాల్సిందే

నాలుగో టెస్టు ఆడేందుకు టీమిండియా సముఖంగా లేదని వార్తలు వచ్చినప్పుడు కంగారు పడ్డానని ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్‌ పైన్‌ అన్నాడు. బ్రిస్బేన్‌లో ఆఖరి టెస్టు ఆడటానికి టీమిండియాకు ఇష్టం లేదని వార్తలు వచ్చిన ...

Updated : 06 Jan 2021 12:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నాలుగో టెస్టు ఆడేందుకు టీమిండియా సముఖంగా లేదని వార్తలు వచ్చినప్పుడు కంగారు పడ్డానని ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్‌ పైన్‌ అన్నాడు. బ్రిస్బేన్‌లో  తుది టెస్టు ఆడటానికి టీమిండియాకు సిద్ధంగా లేదని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై పైన్‌ స్పందిస్తూ... ‘‘కొన్ని విషయాలు ఉత్కంఠకు దారితీశాయి. దీంతో టెస్టు కొనసాగడం ఉత్కంఠ నెలకొంది. అయితే, టీమిండియా సముఖంగా లేదని, నాలుగో టెస్టు ఆడటంపై స్పష్టత రాలేదని, భారత బృందంలో కొందరు పేర్కొన్నట్లు.. తెలియడంతో ఆందోళనకు గురయ్యా. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత శక్తివంతమైన టీమిండియా నుంచి అలాంటి విషయాలు విన్నప్పుడు అవి జరుగుతాయేమో అనిపిస్తుంది’’ అని పైన్‌ వర్చువల్‌ మీడియా సమావేశంలో మాట్లాడాడు.

‘‘మేం ప్రస్తుతం మూడో టెస్టు గురించే ఆలోచిస్తాం. నిబంధనలపై మాకు అవగాహన ఉంది. ఈ వారం ఆటపైనే దృష్టిసారిస్తాం. వచ్చే వారం గురించి తర్వాత ఆలోచిస్తాం. అదే వేదికపై జరగాలని మేం కోరుకోవట్లేదు. ముంబయిలో మ్యాచ్‌ జరిగినా దానికి తగ్గట్లుగా సన్నద్ధమై బరిలోకి దిగుతాం. ఎంతో కాలం తర్వాత టెస్టు క్రికెట్‌ ఆడుతున్నందుకు ఇరు జట్లు సంతోషంగా ఉన్నాయి’’ అని పైన్‌ పేర్కొన్నాడు. భారత ఆటగాళ్లు బయోబబుల్ నిబంధనలు అతిక్రమించారా అని అడిగిన ప్రశ్నకు పైన్‌ సమాధానం ఇవ్వలేదు. ఆ విషయాన్ని టీమిండియానే అడగాలని తోసిపుచ్చాడు.

ఇండోర్ రెస్టారెంట్‌కు వెళ్లినందుకు రోహిత్ శర్మతో సహా నలుగురు ఆటగాళ్లను ఐసోలేషన్‌లో ఉండాలని క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) తెలిపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కోహ్లీ, హార్దిక్‌తో సహా టీమిండియా ఆటగాళ్లు బయోబబుల్‌ నిబంధనలు అతిక్రమించారని ఆస్ట్రేలియా మీడియా దుష్రచారం చేసింది. మరోవైపు నిబంధనలు పాటించకపోతే బ్రిస్బేన్‌కు భారత ఆటగాళ్లు రావాల్సిన అవసరం లేదని క్వీన్స్‌లాండ్‌ ఆరోగ్య మంత్రి వ్యాఖ్యానించడంతో టెస్టు సిరీస్‌పై నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బ్రిస్బేన్‌లో నాలుగో టెస్టు ఆడేందుకు భారత్‌కు ఇష్టం లేదని, అవసరమైతే సిరీస్‌ను మూడు టెస్టులకే పరిమితం చేయాలని జోరుగా వార్తలు వచ్చాయి. అయితే, అవన్నీ వదంతులేనని, టీమిండియా నుంచి ఎటువంటి ప్రతిపాదనలు రాలేదని సీఏ స్పష్టం చేయడంతో టెస్టు సిరీస్‌పై సందిగ్ధత తొలగింది. కాగా, సిడ్నీ వేదికగా గురువారం నుంచి భారత్‌×ఆసీస్ మధ్య మూడో టెస్టు ప్రారంభం కానుంది.

ఇదీ చదవండి..

బాక్సింగ్‌ డే టెస్టుకు హాజరైన అభిమానికి కరోనా

ఇదే మంచి తరుణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని