Imran Khan: ఇమ్రాన్‌ ఖాన్‌ను విస్మరించడంతో నెట్టింట ట్రోలింగ్.. దిగొచ్చిన పాక్‌ క్రికెట్‌ బోర్డు

వన్డే ప్రపంచకప్‌ ప్రచారంలో భాగంగా విడుదల చేసిన వీడియోలో మాజీ కెప్టెన్ ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan)ను విస్మరించి విమర్శలపాలైన పీసీబీ తప్పుని సరిదిద్దుకుంది.

Published : 17 Aug 2023 15:43 IST

ఇంటర్నెట్ డెస్క్: ఈ ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్‌ ప్రచారంలో భాగంగా పాకిస్థాన్‌ తమ దేశ స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్ట్ 14న) పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) ఓ వీడియో పోస్ట్ చేసింది. పాక్‌ క్రికెట్‌ ప్రముఖులు సాధించిన ఘనతలను ఆ వీడియోలో వివరించింది. అయితే, 1992లో పాక్‌కు వరల్డ్‌ కప్‌ను అందించిన మాజీ కెప్టెన్ ఇమ్రాన్‌ ఖాన్ (Imran Khan) అందులో చూపించలేదు. కావాలనే పీసీబీ ఇమ్రాన్‌ఖాన్‌ గొప్పతనాన్ని విస్మరించిందని విమర్శలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం మాజీ ప్రధాని ఇమ్రాన్‌  జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఇమ్రాన్‌ ఖాన్‌ను పీసీబీ తన వీడియోలో చూపించకుండా చేయడం వెనుక ప్రభుత్వ హస్తం ఉందని ఆరోపణలు వచ్చాయి. పీసీబీ తీరును నిరసిస్తూ క్రికెట్ అభిమానులు #ShameOnPCBతో ట్రోలింగ్‌ చేశారు. పలువురు పాక్‌ మాజీ ఆటగాళ్లు సైతం పీసీబీని విమర్శించారు. దీంతో పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు దిగొచ్చింది. ఆగస్ట్‌ 14న పోస్ట్ చేసిన వీడియోని డిలీట్ చేసింది.

‘విరాట్‌ కోహ్లీని కెప్టెన్‌గా కొనసాగించి ఉంటే భారత్‌ ఈ స్థితిలో ఉండేది కాదు’

తాజాగా (ఆగస్టు 17న) కొత్త వీడియోని పోస్ట్ చేసింది. 1992 ప్రపంచకప్ సమయంలో ఇమ్రాన్‌ఖాన్‌ ప్రపంచకప్‌ అందుకున్న దృశ్యాలను పొందుపర్చి ఈ వివాదానికి ముగింపు పలికింది. 1992 వన్డే ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌, ఇంగ్లాండ్ తలపడ్డాయి. ఈ టైటిల్ పోరులో పాక్ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్‌ 72 పరుగులు చేసి జట్టు మంచి స్కోరు (249/6) సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. తర్వాత పాకిస్థాన్‌ మరోసారి ప్రపంచకప్‌ విజేతగా నిలవలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని