Sachin: సచిన్‌.. సచిన్‌.. ఇప్పటికీ అదే క్రేజ్‌.. వైరల్‌గా మారిన వీడియో

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ (Sachin) కశ్మీర్‌లో పర్యటించాడు. ఈ సందర్భంగా విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.

Updated : 22 Feb 2024 12:23 IST

ఇంటర్నెట్ డెస్క్: దాదాపు పాతికేళ్ల క్రికెట్‌ కెరీర్‌.. ఆటకు వీడ్కోలు పలికి పదేళ్లు దాటింది. క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన ‘గాడ్‌ ఆఫ్‌ క్రికెట్’ సచిన్‌ తెందూల్కర్‌ క్రేజ్‌ మాత్రం ఇంకా తగ్గలేదు. ఎక్కడకెళ్లినా అభిమానులు ‘సచిన్.. సచిన్‌’ అంటూ కేరింతలు కొడుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సచిన్‌.. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ ఇస్తుంటాడు. తాజాగా సచిన్‌ కశ్మీర్‌ పర్యటనకు వెళ్లాడు. కుటుంబంతో విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో.. తోటి ప్రయాణికులంతా ‘సచిన్‌’ నామస్మరణతో హోరెత్తించారు. అభివాదం చేసిన సచిన్‌ ..  ధన్యవాదాలు చెబుతూ సీట్‌లో కూర్చున్నాడు. ఈ వీడియోను ఎక్స్‌ యూజర్‌ పోస్టు చేశారు. ‘కొన్ని విషయాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి’’ అని క్యాప్షన్ పెట్టారు. 

‘మన బ్యాట్లకు మద్దతు ఇవ్వండి’

ఎంజే స్పోర్ట్స్‌ యజమాని మహమ్మద్‌ షహీన్‌ మాటలను బట్టి..  కశ్మీర్‌లో క్రికెట్‌ బ్యాట్లను తయారు చేసే కంపెనీకి సచిన్‌ వెళ్లినట్లు తెలుస్తోంది. ‘‘మేం బ్యాట్లను తయారు చేసే పనిలో ఉండగా.. మా గేట్‌ వద్ద ఓ వాహనం ఆగింది. సచిన్‌ తెందూల్కర్‌ను చూడగానే ఆశ్చర్యపోయాం. కొన్ని బ్యాట్ల స్ట్రోక్‌ను పరిశీలించారు. నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు.  కశ్మీర్‌ విల్లో బ్యాట్లు, ఇంగ్లిష్‌ విల్లో బ్యాట్ల నాణ్యతను పోల్చడానికి వచ్చానన్నారు. స్థానిక బ్యాట్ల తయారీదారులకు మద్దతు ఇవ్వాలని మేం కోరాం’’ అని షహీన్‌ తెలిపారు. 

భూతల స్వర్గం: సచిన్

సచిన్‌ తెందూల్కర్‌ తొలిసారి కశ్మీర్‌ పర్యటనకు వెళ్లాడు. అక్కడి అందాలను చూసి ఆశ్చర్యానికి గురైనట్లు వెల్లడించాడు. ‘మేం ఎక్కడ ఉన్నామో?’ చెప్పాలని వీడియోను ఖాతాలో పెట్టాడు. భార్య అంజలి, కుమార్తె సారాతో కలిసి అక్కడికి వెళ్లాడు. శ్రీనగర్ - జమ్మూ హైవేపై కారులో ప్రయాణించాడు. భూతల స్వర్గంలో పర్యటించడం ఆనందంగా ఉందని పేర్కొన్నాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని