Trolling on PCB: ఇమ్రాన్‌ ఖాన్‌ను విస్మరించిన పాక్‌ క్రికెట్‌ బోర్డు.. నెట్టింట ట్రోలింగ్‌!

రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసినా ఫర్వాలేదు కానీ.. క్రీడల్లో జట్టుకు అందించిన ఘనతలను తక్కువగా చేసి చూపించడం తగదని అభిమానులు పేర్కొన్నారు. తాజాగా పాక్‌ క్రికెట్ దిగ్గజం, మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ విషయంలో పీసీబీ వ్యవహరించిన తీరు నెట్టింట విమర్శలకు దారితీసింది.

Updated : 16 Aug 2023 12:39 IST

ఇంటర్నెట్ డెస్క్‌: పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డు (PCB) నెట్టింట ట్రోలింగ్‌కు గురైంది. తమ దేశ స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్ట్ 14న) సందర్భంగా పీసీబీ చేసిన వీడియో ట్వీట్ ఈ వివాదానికి కారణమైంది. తమ దేశ క్రికెట్‌ ప్రముఖుల గురించి చెప్పే క్రమంలో 1992లో పాక్‌కు వరల్డ్‌ కప్‌ను అందించిన మాజీ కెప్టెన్ ఇమ్రాన్‌ ఖాన్ (Imran Khan) గొప్పతనాన్ని కావాలనే విస్మరించినట్లు విమర్శలు ఎదుర్కొంది. ప్రస్తుతం మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ‘తోషీఖానా’ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఇమ్రాన్‌ ఖాన్‌ను పీసీబీ తన వీడియోలో చూపించకుండా చేయడం వెనుక ప్రభుత్వ హస్తం ఉందని ఆరోపణలు వచ్చాయి. పీసీబీ మాజీ ఛైర్మన్ ఖలీద్ మహమూద్‌ కూడా వెంటనే ఆ వీడియోను తొలగించాలని డిమాండ్ చేశారు. మరోవైపు క్రికెట్ అభిమానులు సైతం రాజకీయాలు వేరు, క్రీడలు వేరని పీసీబీని #ShameOnPCBతో ట్రోలింగ్‌ చేశారు. 

‘‘చరిత్ర అనేది కేవలం ఒక్క రోజులోనే సృష్టించలేం. దిగ్గజాలను విస్మరించేలా ఇలాంటి వీడియోలు చేయడం సహించలేనిది’’

‘‘మెల్‌బోర్న్ క్రికెట్‌ స్టేడియం గ్యాలరీలోని దిగ్గజాల్లో ఇమ్రాన్‌ ఖాన్‌ ఒకరు’’

‘‘ఇమ్రాన్‌ లేకుండా 1992 వరల్డ్‌ కప్‌ లేదు. కుటిల ఆలోచనలతో బతకడం ఇప్పటికైనా ఆపండి. ప్రతి క్రికెట్ అభిమాని మదిలో నిలిచిపోతాడు. ఇలాంటి చెత్త వీడియోల ద్వారా మీ గుర్తింపును కోల్పోవడం ఖాయం’’

మీకేమైనా సమస్యలు ఉంటే..:  ఖలీద్‌ మహమూద్

‘‘ఇలాంటి వీడియోలు పెట్టడం అత్యంత బాధాకరం. వెంటనే పీసీబీ వీడియోను తొలగించాలి. మళ్లీ ఇమ్రాన్‌ ఖాన్‌తో కూడిన వీడియోను అప్‌లోడ్ చేయాల్సిందే. ఇటీవల ఐసీసీ విడుదల చేసిన వరల్డ్‌ కప్‌ ప్రోమోలోనే ప్రస్తుత కెప్టెన్ బాబర్ అజామ్‌ను సరిగ్గా ప్రొజెక్ట్‌ చేయలేదని విమర్శించాం. మన గళం వారికి వినిపించాం. అలాంటిది క్రికెట్‌ దిగ్గజానికి ఇలాంటి అవమానం జరగడం సహేతుకం కాదు. మీకు ఇమ్రాన్‌ ఖాన్‌తో రాజకీయపరంగా ఎన్నైనా విభేదాలు ఉండొచ్చు.  అతడి హయాంలో జరిగిన విషయాల్లో అభిప్రాయభేదాలు ఉంటే వాటిని అలాగే ఎదుర్కోవాలి. అంతేకానీ, క్రికెట్‌కు రాజకీయాలకు ముడి పెట్టొద్దు. పాకిస్థాన్‌ కెప్టెన్‌గా దేశ క్రికెట్‌కు వన్నె తెచ్చిన ఆటగాడిని ఇలా అవమానించడం తగదు’’ అని మహమూద్ వ్యాఖ్యానించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని