T20 League: ఏదో ఆడతారులే అనుకున్న వాళ్లే.. అదరగొడుతున్నారు

హార్దిక్‌ పాండ్య, శివమ్‌ దూబె, ఉమేశ్‌ యాదవ్‌, కుల్‌దీప్‌ యాదవ్‌.. ఈ నలుగురు టోర్నీ ప్రారంభానికి ముందు పెద్దగా అంచనాల్లేని ఆటగాళ్లు. తీరా సీజన్‌ మొదలై నాలుగైదు, మ్యాచ్‌లు ఆడగానే...

Published : 16 Apr 2022 01:57 IST

హార్దిక్‌ పాండ్య, శివమ్‌ దూబే, ఉమేశ్‌ యాదవ్‌, కుల్‌దీప్‌ యాదవ్‌.. ఈ నలుగురు టోర్నీ ప్రారంభానికి ముందు పెద్దగా అంచనాల్లేని ఆటగాళ్లు. తీరా సీజన్‌ మొదలై నాలుగైదు, మ్యాచ్‌లు ఆడగానే గణాంకాలలో దూసుకుపోతున్నారు. ఇద్దరు బ్యాట్లు ఝుళిపిస్తుంటే.. మరో ఇద్దరు బంతితో మాయ చేస్తున్నారు. వీరు ఇప్పటివరకూ ఎలా ఆడారో ఒకసారి గమనిస్తే..

అందరికన్నా మిన్న హార్దిక్‌..

ఈసారి కొత్తగా చేరిన జట్టు గుజరాత్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు హార్దిక్‌ పాండ్య. వెన్నునొప్పి శస్త్రచికిత్స తర్వాత సరైన ప్రదర్శన చేయలేక టీమ్‌ఇండియాలోనే చోటు కోల్పోయిన అతడు.. గత రెండేళ్లుగా ముంబయి తరఫునా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. బ్యాటింగ్‌లో మెరుపులు లేక.. బౌలింగ్‌కు పూర్తిగా దూరమైన పరిస్థితులు చవిచూశాడు. ఇలాంటి స్థితిలో గుజరాత్‌ అతడిని కెప్టెన్‌గా తీసుకోవడమే పెద్ద విశేషం. కానీ, ఈ సీజన్‌ ప్రారంభమయ్యాక పాండ్య మారిపోయాడు. కెప్టెన్‌గా రాణిస్తూ.. బ్యాట్స్‌మన్‌గా చెలరేగుతూ.. బౌలర్‌గా నిలదొక్కుకుంటున్నాడు. దీంతో మళ్లీ మునుపటి ఆల్‌రౌండర్‌గా అలరిస్తున్నాడు.

ముంబయి తరఫున గత రెండు సీజన్లలో 281, 127 పరుగులే చేసిన పాండ్య ఈసారి టోర్నీలో సగం మ్యాచ్‌లు కూడా ఆడకముందే 228 పరుగులతో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నాడు. ఇక బౌలింగ్‌లోనూ తన నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేస్తున్నాడు. 7.56 ఎకానమీతో పొదుపుగా బౌలింగ్‌ చేస్తూనే అడపా దడపా వికెట్లు తీస్తున్నాడు. దీంతో పాండ్య ఈ సీజన్‌లో మేటి ఆటగాడిగా సత్తా చాటుతున్నాడు.

చెన్నైపైనే దంచికొట్టిన శివమ్‌ దూబే..

(Photo: Shivam Dube Instagram)

శివమ్‌ దూబే 2019 నుంచీ ఈ టీ20 లీగ్‌లో ఆడుతున్నా గత సీజన్‌లో రాజస్థాన్‌ తరఫున ఒక్క మ్యాచ్‌లోనే మెరిశాడు. అది కూడా చెన్నైతో తలపడిన ఓ లీగ్‌లో మ్యాచ్‌లో 190 పరుగుల భారీ ఛేదనలో దూబె (64 నాటౌట్‌; 42 బంతుల్లో 4x4, 4x6) ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడి రాజస్థాన్‌ను గెలిపించాడు. దీంతో అతడి ప్రతిభను గుర్తించిన చెన్నై ఈసారి మెగా వేలంలో రూ.4 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ క్రమంలోనే ప్రస్తుత సీజన్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌లో కాస్త అండగా నిలిచి అవకాశాలిచ్చింది. వాటిని సద్వినియోగం చేసుకున్న అతడు ఈ సీజన్‌లో ఆ జట్టు తరఫున విశేషంగా రాణిస్తున్నాడు.

ఇప్పటివరకు చెన్నై ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు ఓటమిపాలైనా చివరగా బెంగళూరుపై విజయం సాధించింది. అందులోనూ దూబే (95 నాటౌట్‌; 46 బంతుల్లో 5x4, 8x6) దంచికొట్టడం గమనార్హం. అంతకుముందు లఖ్‌నవూపై 49, పంజాబ్‌పై 57 పరుగులు చేశాడు. దీంతో ఈ సీజన్‌లో అతడు 207 పరుగులతో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక 2021లో రాజస్థాన్‌ తరఫున 9 మ్యాచ్‌లు ఆడి 230 పరుగులు చేసిన దూబే.. 2019, 2020 సీజన్లలో బెంగళూరు తరఫున ఆడిన అతడు ఏమాత్రం చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. ఇలా ఏమాత్రం అంచనాల్లేకుండానే చెన్నై తరఫున అద్భుతంగా ఆడుతున్నాడు.

కోల్‌కతా అవకాశం.. ఉమేశ్ ఉరుములు..

సీనియర్‌ పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ గతేడాది ఈ టీ20 లీగ్‌లో ఆడలేదు. మరోవైపు టీమ్ఇండియా తరఫునా అవకాశాలు సన్నగిల్లాయి. అలాగే ఫిబ్రవరిలో జరిగిన మెగా వేలంలోనూ తొలి రౌండ్‌లో ఎవరూ కొనుగోలు చేయలేదు. కానీ, కోల్‌కతా రెండో రౌండ్‌లో కనీస ధర రూ.2 కోట్లకు దక్కించుకుంది. అనూహ్యంగా చెన్నైతో తొలి మ్యాచ్‌లో అవకాశం ఇచ్చింది. పవర్‌ ప్లేలోనే ఓపెనర్లు ఇద్దర్నీ ఔట్‌ చేసి కోల్‌కతాకు శుభారంభం అందించాడు.

ఆపై బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లోనూ పవర్‌ప్లేలో రెండు వికెట్లు తీసి మరోసారి గొప్ప ఆరంభం అందించాడు. తర్వాత పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా నాలుగు వికెట్లు తీసి కోల్‌కతా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆపై ముంబయితో మ్యాచ్‌లో రోహిత్‌ను.. దిల్లీతో మ్యాచ్‌లో డేవిడ్‌ వార్నర్‌ను ఔట్ చేసి తమ జట్టుకు పెద్ద ఊరట కలిగించాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనే 10 వికెట్లు తీసి అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. దీంతో ఉమేశ్‌ పని అయిపోయింది అనుకున్న వాళ్లకు గట్టి సమాధానం ఇచ్చాడు.

మణికట్టుతో మాయ చేస్తున్న కుల్‌దీప్‌..

చివరగా చెప్పుకోవాల్సింది మణికట్టు స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ గురించి. టీమ్‌ఇండియా జట్టులోకి వచ్చిన అనతికాలంలోనే మంచి పేరు సంపాదించుకున్న అతడు ఈ టీ20 లీగ్‌లో దీర్ఘకాలం కోల్‌కతా తరఫున ఆడాడు. ఈ క్రమంలోనే 2017, 18 సీజన్లలో అద్భుత బౌలింగ్‌ చేశాడు. ఆ రెండు సీజన్లలో వరుసగా 11 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు, 16 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు పడగొట్టాడు. ఇక 2019, 20 సీజన్లలో మరీ దారుణంగా తొమ్మిది మ్యాచ్‌ల్లో 4 వికెట్లు, నాలుగు మ్యాచ్‌ల్లో 1 వికెట్‌ మాత్రమే తీశాడు. అది కూడా అంతర్జాతీయ క్రికెట్‌లో ధోనీ రిటైరయ్యాక కుల్‌దీప్‌ బౌలింగ్‌లో లయ తప్పింది. ధోనీ సలహాలు లేకపోవడంతో వికెట్లు తీయలేక తంటాలు పడ్డాడు.

ఈ క్రమంలోనే 2019, 20 సీజన్లలో దారుణంగా విఫలమైన అతడు తర్వాత టీమ్‌ఇండియాలో చోటు కూడా కోల్పోవాల్సి వచ్చింది. మరోవైపు గతేడాది ఈ టీ20 లీగ్‌లోనూ పోటీలో లేకపోయాడు. దీంతో కుల్‌దీప్‌పై ఈసారి ఎవరికీ పెద్దగా అంచనాలు లేకుండాపోయాయి. కానీ, ఈ సీజన్‌కుముందు దిల్లీ మెగా వేలంలో రూ.2 కోట్లకు దక్కించుకొని అవకాశం ఇచ్చింది. దీంతో వరుసగా రెచ్చిపోతూ ప్రత్యర్థుల వికెట్లను నేలకూలుస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనే 10 వికెట్లు పడగొట్టి ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో 10 వికెట్లతో మూడో స్థానంలో నిలిచాడు.

* ఇలా ఈ నలుగురూ టోర్నీ ప్రారంభానికి ముందు ఏ మాత్రం అంచనాలు లేకపోయినా ఇప్పుడు విశేషంగా రాణిస్తున్నారు. ఇలాగే కొనసాగితే మున్ముందు బ్యాటింగ్‌, బౌలింగ్‌ గణాంకాల జాబితాల్లో అగ్రస్థానంలో నిలిచి రికార్డులు సృష్టించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం బ్యాటింగ్‌లో జోస్‌ బట్లర్‌ 272 పరుగులతో ముందుండగా.. బౌలింగ్‌లో యుజ్వేంద్ర చాహల్‌ 12 వికెట్లతో దూసుకుపోతున్నాడు.

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం..

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని