Rahul Dravid on t20 series lost: ఇంకా లోతైన బ్యాటింగ్‌ ఆర్డర్‌ అవసరం.. : రాహుల్‌ ద్రవిడ్

వెస్టిండీస్‌తో (WI vs IND) టీ20 సిరీస్‌ ఓడినా.. కీలక విషయాలను నేర్చుకోగలిగామని భారత కోచ్ రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్యానించాడు. భవిష్యత్తులో మెరుగుపర్చుకోవడానికి ఇవి దోహదం చేస్తాయని పేర్కొన్నాడు.

Published : 14 Aug 2023 11:57 IST

ఇంటర్నెట్ డెస్క్‌: పొట్టి ఫార్మాట్‌లో బ్యాటింగ్‌ ఆర్డర్‌ సమస్య కనిపించిందని భారత ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid) వ్యాఖ్యానించాడు. వెస్టిండీస్‌తో (WI vs IND) ఐదు టీ20ల సిరీస్‌ను భారత్ 2-3 తేడాతో చేజార్చుకున్న సంగతి తెలిసిందే. ఐదో టీ20 మ్యాచ్‌ అనంతరం ద్రవిడ్ ప్రెస్ కాన్ఫెరెన్స్‌లో మాట్లాడాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌పై కసరత్తు చేయాల్సిన అవసరం ఉందన్నాడు. అక్షర్‌ పటేల్ ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తుండగా.. ఆ తర్వాత చాహల్, కుల్‌దీప్‌, అర్ష్‌దీప్‌, ముకేశ్‌తో కూడిన టెయిలెండర్లు క్రీజ్‌లోకి వస్తారు. మరోవైపు విండీస్‌ తరఫున అల్జారీ జోసెఫ్‌ చివరి స్థానంలో వచ్చి కూడా సిక్స్‌లు కొట్టడం గమనార్హం. ఇదే విషయంపై రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

రెండో బంతికే కెరీర్‌లో తొలి వికెట్‌.. తిలక్‌ కొత్త బాధ్యతలు సక్సెస్!

‘‘విండీస్‌తో టీ20 సిరీస్‌ సందర్భంగా మేం గమనించిన ప్రధాన అంశం బ్యాటింగ్‌ లైనప్‌. కొన్ని అంశాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఈసిరీస్‌ ద్వారా మేం ఎక్కడ మెరుగు కావాలనేది తెలుసుకోగలిగాం. బ్యాటింగ్‌ డెప్త్‌ విషయంలో మరిన్ని ప్రయత్నాలు చేయాలి. మా బౌలింగ్‌ మరీ బలహీనంగా మాత్రం లేదు. భవిష్యత్తులోనూ మ్యాచ్‌లు జరుగుతూనే ఉంటాయి. భారీ స్కోర్లు నమోదు అవుతుంటాయి. అయితే, లోతైన బ్యాటింగ్‌తో బరిలోకి దిగాల్సిన అవసరం ఉంది. వెస్టిండీస్‌ జట్టులో అల్జారీ జోసెఫ్ చివరి స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చినా భారీ షాట్లు ఆడతాడు. అందుకే బ్యాటింగ్‌ విషయంలో మనకు సవాళ్లు ఎదురయ్యాయి. తప్పకుండా వాటిపై వర్కౌట్‌ చేస్తాం’’ అని ద్రవిడ్ తెలిపాడు.

ఐదు టీ20ల సిరీస్‌లో తొలి రెండు మ్యాచుల్లో విండీస్‌ విజయం సాధించగా.. ఆ తర్వాత రెండింట్లో భారత్ గెలిచింది. దీంతో చివరిదైన ఐదో టీ20 మ్యాచ్‌ కీలకంగా మారింది. అయితే భారత్ బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో గొప్పగా రాణించలేకపోవడంతో విండీస్‌ అలవోకగా విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. విండీస్‌ పర్యటనను భారత్‌ ఓటమితో ముగించాల్సి వచ్చింది. ఆగస్ట్ 18 నుంచి బుమ్రా నాయకత్వంలోని టీమ్‌ఇండియా ఐర్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌లో తలపడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని