Rahul Dravid: మేం ఏం చేసినా.. చివరికి మా లక్ష్యమదే: రాహుల్ ద్రవిడ్

వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ (WI vs IND) ఓడిపోవడంపై రాహుల్ ద్రవిడ్‌ స్పందించాడు. ఇలాంటి సిరీసుల్లో మ్యాచ్‌ ఫలితం సమస్య కాదని.. మా లక్ష్యమంతా మెగా టోర్నీలేనని వ్యాఖ్యానించాడు.

Published : 30 Jul 2023 09:55 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ (WI vs IND) పరాజయం పాలైంది. రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) లేకుండా బరిలోకి దిగిన టీమ్‌ఇండియా ఆశించిన మేర ప్రదర్శన చేయలేకపోయింది. ఈ క్రమంలో ప్రయోగాలు చేయడంపై భారత ప్రధాన కోచ్‌ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. తమ ప్రథమ లక్ష్యం రిజర్వ్‌ బెంచ్‌ను పరీక్షించడమేనని, దాని కోసం ఈ సిరీస్‌ను వినియోగించుకుంటున్నట్లు పేర్కొన్నాడు.

‘‘ఆసియా కప్‌, ప్రపంచకప్‌ కోసం మా జట్టను సన్నద్ధం చేసుకోవడానికి ఇదే మాకున్న చివరి అవకాశం. జట్టులోని ఆటగాళ్లను పరీక్షించడానికే ఇలాంటి మార్పులు చేస్తున్నాం. అందరికి అవకాశాలు ఇవ్వడమే మా ఉద్దేశం. ఎన్‌సీఏలో ఉండి వచ్చిన వారిని ఆడించేందుకు ప్రయత్నించాం. వారిలో కొంతమందైనా మెగా టోర్నీల సమయానికి ఫిట్‌గా ఉంటే జట్టుకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఎప్పుడూ భారీ టోర్నీలను దృష్టిలో పెట్టుకునే టీమ్‌ను సన్నద్ధం చేస్తాం. ఏదో ఒక మ్యాచ్‌ లేదా సిరీస్‌లో ఓటమి ఎదురైనా పట్టించుకోం. 

కుందేలు పరిగెత్తినట్లు కాదు.. తాబేలులా ముందుకు..

ఆసియా కప్‌, వన్డే ప్రపంచకప్‌ ముందు ఇలాంటి సిరీసుల్లో రెండు లేదా మూడు మ్యాచ్‌లు ఆడటం వల్ల విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. బయట నుంచి వచ్చే అభిప్రాయాలను పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. ఇప్పుడున్న జట్టులో అద్భుతమైన నైపుణ్యాలు కలిగిన ఆటగాళ్లు ఉన్నారు. వారంతా దేశవాళీ స్థాయిలో రాణించి వచ్చినవారే. జట్టులోని అందరికీ అవకాశాలు ఇవ్వాల్సిన బాధ్యత మాపై ఉంది. అయితే, రెండో వన్డేలో ఓడిపోవడం కాస్త నిరుత్సాహానికి గురి చేసింది. బార్బడోస్ పిచ్‌ కఠినంగా ఉంది. బ్యాటింగ్‌ చేయడం అంత సులువేం కాదు. కనీసం 230 -240 పరుగులు చేసినా మంచి స్కోరుగా మారేది. మధ్యలో వికెట్లను కోల్పోవడంతో 60 పరుగులు చేయలేకపోయాం.

సూర్యకుమార్‌ యాదవ్ అద్భుతమైన ఆటగాడు. తప్పకుండా వన్డే క్రికెట్‌లో కీలకంగా మారతాడు. దురదృష్టవశాత్తూ టీ20లతో పోలిస్తే వన్డేల్లో అతడి ప్రదర్శన సరిగ్గా లేదనేది వాస్తవం. అయితే, తప్పకుండా మెరుగుపడతాడనే విశ్వాసం మాకుంది. దానికోసం అతడికి మరిన్ని అవకాశాలు ఇస్తాం. వాటిని సద్వినియోగం చేసుకుంటాడని భావిస్తున్నాం. ఓపెనర్‌గా వచ్చిన ఇషాన్‌ కిషన్‌ బాగా ఆడాడు. ఇలాంటి పిచ్‌పై వరుసగా రెండు హాఫ్‌ సెంచరీలు సాధించడం అభినందనీయం. యంగ్‌ ప్లేయర్ల నుంచి మేం ఆశించేది కూడా ఇలాంటి ప్రదర్శనే’’ అని రాహుల్ ద్రవిడ్ వెల్లడించాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు