Hardik: కుందేలు పరిగెత్తినట్లు కాదు.. తాబేలులా ముందుకు..: హార్దిక్‌

రెండో వన్డేలో విండీస్‌ (WI vs IND) అద్భుతంగా పుంజుకుని విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్, విండీస్ 1-1తో సమంగా నిలిచాయి. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో విఫలమైన టీమ్‌ఇండియా ఓటమిని చవిచూసింది.

Updated : 30 Jul 2023 09:28 IST

ఇంటర్నెట్ డెస్క్‌: రెండో వన్డేలో భారత్‌కు (WI vs IND) చుక్కెదురైంది. విండీస్‌ బౌలింగ్‌ను తట్టుకోవడంలో ఓపెనర్లు మినహా టీమ్‌ఇండియా (Team India) బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో 181 పరుగులకే ఆలౌటైంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ లేకుండా బరిలోకి దిగిన భంగపాటు తప్పలేదు. అనంతరం 182 పరుగుల టార్గెట్‌ను కాపాడుకోవడంలోనూ భారత బౌలర్లు విఫలమయ్యారు. ఆరంభంలో శార్దూల్ ఠాకూర్, కుల్‌దీప్‌ వికెట్లను పడగొట్టారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యతోపాటు ఇతర బౌలర్లు ప్రభావం చూపించలేకపోయారు. ఈ క్రమంలో భారత్‌ ఓటమిపై హార్దిక్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. 

టీమ్‌ఇండియాకు ఎదురుదెబ్బ.. రెండో వన్డేలో వెస్టిండీస్‌ విజయం

‘‘బ్యాటింగ్‌లో మేం అనుకున్న విధంగా రాణించలేకపోయాం. తొలి వన్డేతో పోలిస్తే ఈ మ్యాచ్‌కు వినియోగించిన పిచ్‌ బాగుంది. సరైన ప్రదర్శన ఇవ్వలేకపోవడం నిరుత్సాహానికి గురి చేసింది. అయితే, తప్పకుండా ఇలాంటి ఓటముల నుంచి పాఠాలను నేర్చుకుంటాం. మా ఓపెనర్లు ఇచ్చిన శుభారాంభాన్ని కొనసాగించలేకపోయాం. ఇషాన్‌ కిషన్‌ మినహా మిగతా బ్యాటర్లం నేరుగా ఫీల్డర్లకే క్యాచ్‌లు ఇచ్చి పెవిలియన్‌కు చేరడం నిరాశకు గురి చేసింది. బౌలింగ్‌లోనూ నేను మరిన్ని ఓవర్లు వేయడంపై దృష్టిపెట్టాలి. వన్డే ప్రపంచ కప్‌ నాటికి సిద్ధం కావాలంటే నేను ఇంకా శ్రమించాలి. అయితే, కుందేలు మాదిరిగా కాకుండా తాబేలులా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ సాగుతున్నా. మెగా టోర్నీ నాటికి సిద్ధమవుతానని భావిస్తున్నా. ప్రస్తుతం విండీస్‌తో సిరీస్‌లో 1-1తో సమంగా ఉన్నాం. చివరి మ్యాచ్‌ మరింత ఆసక్తికరంగా ఉంటుందని భావిస్తున్నా’’ అని పాండ్య అన్నాడు 

అలా జరిగినప్పుడు మాదే విజయం: షై హోప్‌

‘‘రెండో వన్డేలో నా ఆట పట్ల ఆనందంగా ఉంది. నేను ఎప్పుడు హాఫ్ సెంచరీ లేదా సెంచరీ చేసినా మా జట్టు గెలుస్తుంది. ఇలాంటి వికెట్‌ మీద పరుగులు చేయాలంటే జాగ్రత్తగా ఆడాలి. భారత్‌ వంటి నాణ్యమైన బౌలింగ్‌ను ఎదుర్కోవడం సాధారణ విషయం కాదు. ప్రస్తుతం ఒక మ్యాచ్‌ గెలిచాం. తర్వాతి మ్యాచ్‌నూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకుంటాం. మా ఆటగాళ్లు చాలా కష్టపడ్డారు. మా ఆట ఎలా ఉండాలని అనుకున్నామో అదే విధంగా మైదానంలో ప్రదర్శించాం. పిచ్‌ నుంచి సవాల్‌ ఎదురైంది. అయినా ఎదురొడ్డి విజయం సాధించాం. తప్పకుండా సిరీస్‌ను నెగ్గుతామనే నమ్మకం ఉంది’’ అని విండీస్‌ కెప్టెన్‌ షై హోప్‌ వ్యాఖ్యానించాడు. ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డు అతడే సొంతం చేసుకున్నాడు. గత పది వన్డేల తర్వాత భారత్‌పై విండీస్‌కు ఇదే తొలి విజయం కావడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని