ODI World Cup 2023: అశ్విన్‌ ఆలోచన బాగుంది.. కానీ అది మన చేతుల్లో లేదు: రోహిత్

న్యూజిలాండ్‌తో (New Zealand) తొలి వన్డే ఆడేందుకు టీమ్‌ఇండియా (Team India) హైదరాబాద్‌కు చేరుకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) కీలక విషయాలపై మాట్లాడాడు. అలాగే ప్రపంచకప్‌ మ్యాచ్‌లకు (ODI World Cup 2023) సంబంధించి ఇటీవల అశ్విన్‌ చేసిన సూచనలపైనా రోహిత్ స్పందించాడు.

Updated : 18 Jan 2023 13:04 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌ వేదికగా వన్డే ప్రపంచకప్‌ 2023 టోర్నీ జరగనున్న విషయం తెలిసిందే. అయితే డే/నైట్ మ్యాచ్‌ సందర్భంగా మంచు ప్రభావం ఛేదన చేసే జట్టుకు లబ్ధి చేకూర్చుతుందని, బౌలింగ్‌ వేసే టీమ్‌కు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని క్రికెట్‌ విశ్లేషకులు పేర్కొన్నారు. ఇదే విషయంపై అశ్విన్‌ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మ్యాచ్‌ల వేళలను కాస్త ముందుకు జరిపితే బాగుంటుందని తెలిపాడు. మధ్యాహ్నం 2.30 గంటలకు కాకుండా ఉదయం 11.30కే ప్రారంభించాలని సూచించాడు. లేకపోతే టాస్ కీలకంగా మారుతుందని పేర్కొన్నాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌ సందర్భంగా ప్రెస్ కాన్ఫెరెన్స్‌లో టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఇలాంటి ప్రశ్న ఎదురవడంతో స్పందించాడు. 

‘‘ఇది మంచి ఆలోచనే. అయితే టాస్‌ మీదే ఎక్కువ ఆధారపడకుండా ఉండాలి. ఎందుకంటే ఇది ప్రపంచకప్‌. కాస్త ముందుగానే మ్యాచ్‌ను ప్రారంభించాలనే ఆలోచన నాకు నచ్చింది. అయితే ఇది సాధ్యమవుతుందా..? లేదా..? అనేది నాకైతే తెలియదు. ప్రసారకర్తలు దానిని నిర్ణయిస్తారు (నవ్వుతూ). అయితే మ్యాచ్‌లో ఒకరికి ప్రయోజనం కలగడం మాత్రం సరైంది కాదు. మంచుతో కూడిన పరిస్థితుల్లో బ్యాటింగ్‌ అడ్వాంటేజ్‌ లేకుండా నాణ్యమైన క్రికెట్‌ను ఆడాలని కోరుకోవాలి. అయితే ఇవన్నీ మన కంట్రోల్‌లో ఉండవు. మ్యాచ్‌ను ముందుగా ప్రారంభించాలనే ఆలోచన మాత్రం బాగుంది’’ అని రోహిత్‌ వెల్లడించాడు. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ వేదికగా న్యూజిలాండ్‌తో తొలి వన్డే మ్యాచ్‌ను భారత్‌ ఆడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని