WI vs IND: అలాంటి బాధ్యతల స్వీకరణకు ముందుకురావడం అభినందనీయం: రోహిత్

బ్యాటింగ్, బౌలింగ్‌ విభాగాల్లో అద్భుతంగా రాణించిన టీమ్‌ఇండియా 1-0 తేడాతో విండీస్‌ను (WI vs IND) చిత్తు చేసి టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. రెండో టెస్టులోనూ విజయం సాధించే అవకాశాలు ఉన్నప్పటికీ.. వర్షం కారణంగా డ్రాగా ముగించాల్సిన పరిస్థితి ఎదురైంది.

Updated : 25 Jul 2023 12:17 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ట్రినిడాడ్‌ వేదికగా వెస్టిండీస్ - భారత్ జట్ల (WI vs (IND) మధ్య జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. వర్షం కారణంగా ఐదో రోజు ఆట ఒక్క బంతి పడకుండానే రద్దు కావడం అభిమానులను నిరాశకు గురి చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన టీమ్‌ఇండియా బౌలర్ మహమ్మద్ సిరాజ్‌ తన టెస్టు కెరీర్‌లో తొలి ‘ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డు’ దక్కించుకున్నాడు. అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ, వెస్టిండీస్ కెప్టెన్ బ్రాత్‌వైట్, టీమ్ఇండియా పేసర్ సిరాజ్‌ మాట్లాడారు. 

ఇలా జరగడం దురదృష్టకరం.. 

‘‘ఎక్కడ విజయం సాధించినా దానికి ప్రత్యేకత ఉంటుంది. వెస్టిండీస్‌తో వారి సొంత దేశంలో సిరీస్‌ను గెలవడం ఆనందంగా ఉంది. అయితే, రెండో టెస్టు చివరి రోజు ఆట కూడా జరిగి ఉంటే బాగుండేది. వర్షం కారణంగా సాధ్యపడకపోవడం దురదృష్టకరం. అభిమానులతోపాటు మమ్మల్ని నిరాశకు గురిచేసింది. ఇలాంటి పిచ్‌ (ట్రినిడాడ్) మీద పరుగులు చేయడం చాలా కష్టమే. కానీ, మా బ్యాటర్లు దూకుడుగా ఆడి పరుగులు రాబట్టడం అభినందనీయం. పేసర్ సిరాజ్‌ నిరంతరం మెరుగుపడుతూనే ఉన్నాడు. ఈ సిరీస్‌లో పేస్‌ బౌలింగ్‌ను నడిపించడానికి ముందుడుగు వేయడం గొప్ప నిర్ణయం. అయితే, ఎవరో ఒకరే నడిపించాలనే దానిని అంగీకరించను. ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. బౌలింగ్‌ కోసం బంతిని చేతిలోకి తీసుకున్న వారు ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించాలి. 

వదలని వరుణుడు.. విండీస్‌తో రెండో టెస్టు డ్రా

ఈ మ్యాచ్‌లో ప్రమోషన్‌ పొంది ముందుకొచ్చిన ఇషాన్‌ కిషన్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. వేగంగా పరుగులు చేయాలనేదే మా లక్ష్యం. అందుకు తగ్గట్టుగానే ఇషాన్‌ ఇన్నింగ్స్ సాగింది. ఎక్కడా భయపడకుండా ధాటిగా ఆడాడు. విరాట్ కోహ్లీ వంటి సీనియర్‌ ఆటగాడు నిలకడగా ఆడితే ఎలాంటి జట్టుకైనా సానుకూలాంశంగా మారుతుంది. రెండు టెస్టుల్లోనూ అద్భుతంగా ఆడాడు. ఇప్పుడు మా జట్టు యువకులు, సీనియర్లతో సమతూకంగా ఉంది. ఒత్తిడిలోనూ రాణించేలా ఫీల్డింగ్‌, బ్యాటింగ్‌, బౌలింగ్‌ యూనిట్లను బలోపేతం చేయడమే మా ముందున్న కర్తవ్యం’’ అని రోహిత్ తెలిపాడు. 

కాస్త పోరాటపటిమ చూపాం: బ్రాత్‌వైట్

‘‘తొలి టెస్టు మ్యాచ్‌లో మా ప్రదర్శన తీసికట్టుగా ఉంది. అయితే, రెండో టెస్టులో మాత్రం భారత్‌కు కాస్త సవాల్‌ విసిరాం. పోరాటపటిమ చూపామని భావిస్తున్నా. నాలుగో రోజు తొలి సెషన్‌లోనే ఐదు వికెట్లు కోల్పోవడంతో వెనుకబడిపోయాం. అలా జరగకుండా ఉండాల్సింది. రెండో ఇన్నింగ్స్‌లో పరిస్థితులు అనుకూలంగా ఉంటే మేం కూడా ఛేదన దిశగా సాగేవాళ్లమే. వర్షం కారణంగా ఆట రద్దు కావడం కాస్త బాధించింది. మా యువ ఆటగాడు అథనేజ్‌ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అలాగే కిర్క్‌ మెకంజీ కూడా మంచి ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరూ ఇలాగే కొనసాగితే విండీస్‌ క్రికెట్‌కు చాలా కాలం ఆడతారు’’ అని బ్రాత్‌వైట్‌ చెప్పాడు. 

ఇది నా ఫస్ట్‌ అవార్డు: సిరాజ్

‘‘నా టెస్టు కెరీర్‌లో ఇది తొలి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డు. విదేశాల్లో ఇలాంటి ప్రదర్శనతో దాన్ని అందుకోవడం ఆనందంగా ఉంది. అనుకున్న విధంగా బంతిని సంధించడమే నా సింపుల్ లాజిక్. దానికే కట్టుబడి బౌలింగ్‌ చేశా. ఇలాంటి పిచ్‌పై వికెట్లు తీస్తే ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. రోహిత్ నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు. ఎలాంటి ఒత్తిడి పెట్టుకోకుండా ఎంజాయ్‌ చేస్తూ బౌలింగ్‌ వేయమని సూచించాడు’’ అని సిరాజ్‌ వ్యాఖ్యానించాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని