IPL 2024: నా కెప్టెన్సీలో ఆడేందుకు రోహిత్‌ ఇబ్బందిపడడు: హార్దిక్ పాండ్య

టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో (Rohit Sharma) కలిసి ఐపీఎల్‌లో ముంబయి జట్టుతో ఆడేందుకు ఎదురుచూస్తున్నట్లు హార్దిక్ పాండ్య వ్యాఖ్యానించాడు. ఐపీఎల్‌ 17వ సీజన్‌ సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు.

Published : 18 Mar 2024 17:23 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్‌ 17వ (IPL) సీజన్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) వ్యాఖ్యానించాడు. మరో నాలుగు రోజుల్లో ఐపీఎల్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాండ్య మాట్లాడాడు. రోహిత్ శర్మతో కలిసి ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. తన కెప్టెన్సీలో హిట్‌మ్యాన్‌ ఆడటం ఇబ్బందేమీపడకపోవచ్చని హార్దిక్ తెలిపాడు. ఈ సీజన్‌లో అతడి సాయంతో జట్టును విజయాల బాట పట్టిస్తాననే నమ్మకం ఉందన్నాడు. మార్చి 24న గుజరాత్‌ టైటాన్స్‌తో ముంబయి తొలి మ్యాచ్‌ ఆడనుంది. 

‘‘నా సారథ్యంలో రోహిత్ ఆడటంలో పెద్ద వ్యత్యాసం ఏమీ ఉండదు. తప్పకుండా అతడి సాయం తీసుకుని జట్టును నడిపిస్తా. ఎలాంటి అవసరం ఉన్నా సంప్రదిస్తా. అతడు భారత జట్టు సారథి. ఇప్పుడు నాకు సహకారం అందిస్తాడు. రోహిత్ నాయకత్వంలో ముంబయి ఏం సాధించిందనేది అందరికీ తెలుసు. దానిని కొనసాగించాల్సిన బాధ్యత నాపై ఉంది. కాబట్టి, నేను సారథి అయినంత మాత్రాన రోహిత్ ఆడటంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. నా కెరీర్‌ మొత్తం అతడి సారథ్యంలోనే ఆడా. తప్పకుండా ఈ సీజన్‌ మొత్తం నా భుజంపై అతడి చేయి ఉంటుందని భావిస్తున్నా. కెప్టెన్సీ ప్రకటించినప్పుడు అభిమానుల నుంచి విభిన్న స్పందనలు వచ్చాయి. అయితే, అభిమానులను నేను గౌరవిస్తా. అదే సమయంలో మేం జట్టుగా ఆటపై దృష్టి పెడతాం. నా నియంత్రణలో ఉన్న వాటిని గమనిస్తూనే ఉంటా. కానీ, అదుపు చేయలేని వాటిని ఏం చేయలేం. ఏదైనా అనే హక్కు అభిమానులకు ఉంది. వారి అభిప్రాయాన్ని గౌరవిస్తా’’ అని పాండ్య తెలిపాడు. 

బీసీసీఐ నుంచి సూర్య ఫిట్‌నెస్‌ అప్‌డేట్‌ రావాలి: బౌచర్

ముంబయి ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ఫిట్‌నెస్‌పై ప్రధాన కోచ్‌ మార్క్ బౌచర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గతేడాది డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాతో టీ20 మ్యాచ్‌ తర్వాత సూర్య ఇప్పటి వరకు మైదానంలోకి దిగలేదు. ‘‘మేం సూర్యకుమార్‌ యాదవ్‌ ఫిట్‌నెస్‌కు సంబంధించిన అప్‌డేట్ కోస వేచి చూస్తున్నాం. బీసీసీఐ నుంచి సమాచారం రావాల్సి ఉంది. ఎలాంటి ఫిట్‌నెస్‌ సమస్య ఉన్నా పరిష్కరిస్తాం. మా వద్ద ప్రపంచస్థాయి వైద్యబృందం అందుబాటులో ఉంది’’ అని బౌచర్‌ వెల్లడించాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని