IPL 2023: రోహిత్‌ శర్మ ఐపీఎల్‌ నుంచి విరామం తీసుకోవాలి: సునీల్ గావస్కర్

రోహిత్‌ శర్మ ఐపీఎల్‌లో కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకోవాలని భారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) సూచించాడు.

Published : 26 Apr 2023 18:32 IST

ఇంటర్నెట్ డెస్క్: ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma)కు భారత మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్‌ (Sunil Gavaskar) కీలక సూచన చేశాడు. ఐపీఎల్‌లో కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకోవాలని సూచించాడు. తద్వారా ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌ ఫైనల్‌ (WTC Final)కు ఫ్రెష్‌ మైండ్‌సెట్‌తో బరిలోకి దిగొచ్చని చెప్పాడు. అవసరమైతే రోహిత్‌ ఐపీఎల్ చివరి అంకంలో మూడు, నాలుగు మ్యాచ్‌లు ఆడి లయను అందుకోవచ్చని గావస్కర్‌ వివరించాడు. జూన్‌ 7 నుంచి 11 వరకు లండన్‌లోని ఓవల్‌ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్‌ జరగనున్న విషయం తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక పోరులో టీమ్‌ఇండియా, ఆస్ట్రేలియా తలపడనున్నాయి.

‘‘రోహిత్‌ శర్మ కాస్త ఒత్తిడికి గురువుతున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం అతడు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌ గురించి ఆలోచిస్తున్నాడని అనుకుంటున్నా. రోహిత్ ఐపీఎల్‌లో కొన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకోవాలి. అవసరమైతే ఆఖర్లో మూడు, నాలుగు మ్యాచ్‌లు ఆడాలి. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌ కోసం అతడు లయను అందుకోవడానికి ఆ మ్యాచ్‌లు ఉపయోగపడతాయి’’ అని సునీల్ గావస్కర్‌ చెప్పాడు.  ముంబయి ఇండియన్స్‌ ఆటతీరు గురించి మాట్లాడుతూ.. ‘‘ఈ సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌ ప్లే ఆఫ్స్‌ చేరాలంటే ఏదైనా అద్భుతం జరగాలి. వారు టాప్‌-4లో చోటు దక్కించుకోవాలనుకుంటే అసాధారణ ప్రదర్శన కనబర్చాలి.  బౌలర్లు పదే పదే అవే తప్పులు   చేస్తున్నప్పుడు కొన్ని మ్యాచ్‌లకు వారి పక్కన పెట్టాలి.  అనంతరం బౌలర్లు ఎక్కడ తప్పు చేస్తున్నారో గుర్తించాలి’’ అని గావస్కర్‌ సూచించాడు.

ఈ సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌ తన స్థాయి తగ్గట్టుగా ఆడట్లేదు. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో నాలుగింటి ఓటమిపాలై మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఆ జట్టుకు బౌలింగ్‌ ప్రధాన సమస్యగా మారింది. ఆఖరి ఓవర్లలో ధారాళంగా పరుగులిచ్చేస్తూ మ్యాచ్‌పై పట్టుకోల్పోతున్నారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ముంబయి ఏడో స్థానంలో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని