Rohit Sharma: యువరాజ్‌ తర్వాత ఆ స్థానంలో ఎవరూ సక్సెస్‌ కాలేదు: రోహిత్‌ శర్మ

యువరాజ్‌ సింగ్ రిటైర్‌మెంట్ ప్రకటించిన తర్వాత వన్డేల్లో నాలుగో స్థానంలో ఏ ఆటగాడు కూడా స్థిరంగా కొనసాగలేదని భారత కెప్టెన్ రోహిత్‌ శర్మ (Rohit Sharma) పేర్కొన్నాడు.

Published : 10 Aug 2023 19:42 IST

ఇంటర్నెట్ డెస్క్: మరో రెండు నెలల్లో వన్డే ప్రపంచ కప్‌ (World Cup 2023) ప్రారంభం కానుంది. ఇప్పటికే చాలా దేశాలు ప్రపంచ కప్‌లో ఆడే ఆటగాళ్లపై ఓ అంచనాకు వచ్చేశాయి. సొంతగడ్డపై ప్రపంచకప్‌ ఆడనున్న భారత జట్టు (Team India)లో కచ్చితంగా ఈ ఆటగాళ్లుంటారని చెప్పలేని పరిస్థితి. 2019 ప్రపంచకప్ మాదిరిగానే ఈసారి కూడా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేసే ఆటగాడిపై స్పష్టత లేదు. కొన్నాళ్లు ఈ స్థానంలో ఆడి మంచి ప్రదర్శన చేసిన శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా జట్టుకు దూరమై ప్రస్తుతం కోలుకుంటున్నాడు. అతడు వన్డే ప్రపంచకప్‌లో ఆడతాడా లేదా అని ఇప్పుడు చెప్పలేం. తాజాగా ఈ అంశంపై కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మాట్లాడాడు. ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్ (Yuvraj Singh) రిటైర్‌మెంట్ తీసుకున్నప్పటి నుంచి వన్డేల్లో నాలుగో స్థానంలో ఏ బ్యాటర్‌ కూడా స్థిరంగా కొనసాగలేదని  రోహిత్‌పేర్కొన్నాడు.

రోహిత్‌ రికార్డుకు కార్‌ నంబర్‌కు లింక్‌.. ఇంతకీ అదేంటంటే?

‘‘బ్యాటింగ్ ఆర్డర్‌లో నాలుగో స్థానం మమ్మల్ని చాలా కాలంగా ఇబ్బందిపెడుతోంది. యువీ (యువరాజ్ సింగ్) తర్వాత ఎవరూ ఈ స్థానంలో స్థిరంగా లేరు. చాలా గ్యాప్‌ తర్వాత ఈ స్థానాన్ని శ్రేయస్‌ అయ్యర్‌ భర్తీ చేశాడు. అతడు చాలా బాగా ఆడాడు. మంచి స్కోర్లు సాధించాడు. దురదృష్టవశాత్తు శ్రేయస్ గాయాలబారినపడి ఇబ్బంది పడ్డాడు. కొంతకాలం ఆటకు దూరమయ్యాడు. గత 4-5 సంవత్సరాలలో చాలామంది ఆటగాళ్లు గాయాలపాలయ్యారు. దీంతో ఆ స్థానంలో ఎప్పుడూ కొత్త ఆటగాడిని పంపాల్సి వచ్చింది’’ అని రోహిత్ వివరించాడు. 

ప్రస్తుతం హార్దిక్ పాండ్య నాయకత్వంలో టీమ్‌ఇండియా.. విండీస్‌తో ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ ఆడుతోంది. మొదటి రెండు టీ20ల్లో విండీస్‌ గెలుపొందగా.. మూడో టీ20లో భారత్ విజయం సాధించింది. నాలుగో టీ20 శనివారం జరగనుంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తేనే సిరీస్ టీమ్‌ఇండియా వశమవుతుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని