Rohit Sharma: ఐపీఎల్ మెగా వేలం.. రోహిత్‌ శర్మను లఖ్‌నవూ తీసుకుంటుందా? కోచ్‌ ఏమన్నాడంటే..

ఐపీఎల్ 18 సీజన్‌కు ముందు జరిగే మెగా వేలంలో రోహిత్ శర్మ (Rohit Sharma) పాల్గొంటే అతడిని తీసుకునేందుకు చాలా ఫ్రాంచైజీలు పోటీపడటం ఖాయం. లఖ్‌నవూ కూడా రోహిత్‌పై ఆసక్తి చూపుతున్నట్లు కనిపిస్తోంది.

Published : 11 Apr 2024 00:08 IST

ఇంటర్నెట్ డెస్క్: అయిదు టైటిళ్లు అందించిన రోహిత్ శర్మ (Rohit Sharma)ను కాదని హార్దిక్‌ పాండ్యకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది ముంబయి ఫ్రాంచైజీ. ఇది తీవ్ర దుమారానికి దారితీసింది. రోహిత్ ఫ్యాన్స్‌ ముంబయి ఫ్రాంచైజీ తీసుకున్న నిర్ణయంపై మండిపడ్డారు. దీనికితోడు కెప్టెన్‌గా హార్దిక్‌ వ్యవహరిస్తున్న తీరు కూడా అతడిని విమర్శలపాలుజేస్తోంది. రోహిత్ శర్మను కావాలనే హార్దిక్ ఫీల్డింగ్‌ సెటప్‌లో అటూఇటూ మార్చుతున్నాడని ఆరోపిస్తున్నారు. ఈ ముంబయి కెప్టెన్సీ వివాదం కొనసాగుతున్న వేళ ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. 2025లో జరిగే మెగా వేలంలో రోహిత్‌ ముంబయిని వీడతాడని ప్రచారం జరుగుతోంది. రోహిత్‌ వేలంలోకి వస్తే అతడిని తీసుకుని కెప్టెన్‌ను చేయాలని చాలా ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. లఖ్‌నవూ కూడా రోహిత్‌పై ఆసక్తి చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. 

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో లఖ్‌నవూ కోచ్ జస్టిన్‌ లాంగర్‌కు ఓ ప్రశ్న ఎదురైంది. వేలంలో మీరు ఏ ఆటగాడిని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఇంటర్వ్యూయర్‌ అడగ్గా.. ‘‘ఒక్క పేరే చెప్పాలా? ఎవరి పేరైనా చెప్పవచ్చా? నేను ఎవరి పేరు చెబుతానని మీరు అనుకుంటున్నారు?’’ అని లాంగర్‌ తిరిగి ప్రశ్నించాడు. ‘‘మేం చాలామంది పేర్లను అనుకుంటున్నాం. కానీ, మీరు రోహిత్‌శర్మను జట్టులోకి తీసుకోగలరా?’’ అని ఇంటర్వ్యూయర్‌ బదులిచ్చాడు. దీంతో ఆశ్చర్యపోయిన లాంగర్‌ ‘‘ఏంటీ.. రోహిత్‌ శర్మనా? ఓకే. మేం అతడిని తీసుకుంటాం. మీరే ఈ డీల్ కుదర్చగలరు’’అని లాంగర్ సరదాగా సమాధానమిచ్చాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని