Ishan Kishan: దాని గురించి ఆలోచించొద్దని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నాతో చెప్పారు: ఇషాన్‌ కిషన్‌

టీ20 లీగ్‌ మెగా వేలంలో టీమ్‌ఇండియా ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ని ముంబయి జట్టు రూ.15.75 కోట్లు వెచ్చించి దక్కించుకుంది. ఇంత భారీ మొత్తం దక్కించుకున్న ఇషాన్‌ కిషన్‌ అంచనాలను అందుకోలేకపోతున్నాడు.

Published : 12 May 2022 01:18 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 లీగ్‌ మెగా వేలంలో టీమ్‌ఇండియా యువ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ని ముంబయి జట్టు రూ.15.75 కోట్లు వెచ్చించి దక్కించుకుంది. ఇంత భారీ మొత్తం దక్కించుకున్న ఇషాన్‌ కిషన్‌ అంచనాలను అందుకోలేకపోతున్నాడు. 11 ఇన్నింగ్స్‌ల్లో 321 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడి ఆటతీరుపై పలువురు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తనకు పలికిన ధర గురించి ఇషాన్‌ కిషన్‌ బుధవారం మాట్లాడాడు. వేలంలో దక్కిన ధర గురించి ఆటగాడిపై రెండు రోజులు మాత్రమే ఒత్తిడి ఉంటుందన్నాడు. కానీ జట్టు విజయాలకు సహకరించడం, ఆటతీరు మెరుగుపర్చుకోవడంపై దృష్టిపెట్టడం ముఖ్యమని పేర్కొన్నాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉండడం, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్య వంటి ఆటగాళ్లతో మాట్లాడటం వల్ల వేలంలో పలికిన ధర గురించి ఒత్తిడిని అధిగమించగలిగానని ఇషాన్ కిషన్ వివరించాడు. 

‘వేలం ముగిసిన తర్వాత ధర గురించి ఆటగాడిపై గరిష్ఠంగా ఒకట్రెండురోజుల వరకు ఒత్తిడి ఉంటుంది. కానీ, ఇలాంటి పరిస్థితుల్లో నేను అలాంటి విషయాలపై దృష్టిపెట్టనని మీరు అర్థం చేసుకోవాలి. నా జట్టు గెలవడానికి ఏ విధంగా సహాయపడాలనే దానిపైనే నా దృష్టి ఉంది. మీపై ధర గురించి ఒత్తిడి ఉన్నప్పుడు మీ చుట్టూ ఉన్న సీనియర్లతో మాట్లాడటం ఉపయోగపడుతుంది. బెంగళూరుతో మ్యాచ్‌ జరిగినప్పుడు నేను రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో మాట్లాడా. హార్దిక్‌ పాండ్యతో కూడా మాట్లాడా. ‘నువ్వు ధర గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు’ అని వారు నాతో చెప్పారు. ఎందుకంటే ఇంత డబ్బు కావాలని నేను కోరలేదు. టీమ్‌కి నాపై నమ్మకం ఉంది. అందుకే డబ్బు ఖర్చు చేశారు’ అని ఇషాన్‌ కిషన్‌ అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని