Sunil Gavaskar : వరల్డ్‌కప్‌ ఓటమి నుంచి బయటపడేందుకు రోహిత్‌కు ఇదో మంచి అవకాశం : గావస్కర్‌

దక్షిణాఫ్రికా గడ్డపై ఇప్పటి వరకూ టీమ్‌ఇండియా టెస్టు సిరీస్‌ నెగ్గింది లేదు. దీంతో ఆ లోటు తీర్చేందుకు రోహిత్‌ శర్మ(Rohit Sharma) ముందు మంచి అవకాశం ఉందని గావస్కర్‌(Sunil Gavaskar) పేర్కొన్నాడు.

Published : 12 Dec 2023 11:02 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచ కప్‌ (ODI World Cup 2023)లో టీమ్‌ఇండియాను రోహిత్‌ శర్మ(Rohit Sharma) అద్భుతంగా నడిపించిన విషయం తెలిసిందే. ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై ఓటమిపాలైనప్పటికీ.. టోర్నీ మొత్తం టీమ్‌ఇండియాదే (Team India) ఆధిపత్యం. అయితే.. చివరి మెట్టుపై బోల్తాపడటం ఆటగాళ్లతో పాటు అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఆ ఓటమి నుంచి బయటపడేందుకు రోహిత్‌కు దక్షిణాఫ్రికా సిరీస్‌ (SA vs IND) రూపంలో మరో అవకాశం వచ్చిందని మాజీ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌(Sunil Gavaskar) అన్నాడు.

ఇప్పటి వరకూ టీమ్‌ఇండియా దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్‌ గెలవలేదు. ప్రస్తుత దక్షిణాఫ్రికా పర్యటనలో రోహిత్‌ కేవలం.. టెస్టు సిరీస్‌కు మాత్రమే సారథ్యం వహిస్తున్న నేపథ్యంలో ఆ సిరీస్‌ను నెగ్గాలని గావస్కర్‌ ఆకాంక్షించాడు.

‘రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ గత 6-8 నెలల నుంచి అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నారు. కలీస్‌ చెప్పినట్లు.. రోహిత్‌ ఈ టెస్టు సిరీస్‌లో కీలక ఆటగాడిగా మారతాడు. జట్టులో నంబర్‌ 3, 4, 5 స్థానాలను సెట్‌ చేయడానికి పెద్ద పాత్ర పోషించాలి. ఏదీ ఏమైనప్పటికీ.. ప్రపంచకప్‌ ఫైనల్‌ ఓటమిని భర్తీ చేసేందుకు రోహిత్‌కు ఇది చక్కటి అవకాశం’ అని గావస్కర్‌ ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడుతూ విశ్లేషించాడు.

వరుణుడు కరుణించేనా?

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్‌లను వారి సొంతగడ్డపై ఓడించి టెస్టు సిరీస్‌ విజయాలను దక్కించుకున్న టీమ్‌ఇండియా.. దక్షిణాఫ్రికా గడ్డపై మాత్రం తడబడుతోంది. ఇప్పటి వరకు అక్కడ భారత్‌ ఒక్క టెస్టు సిరీస్‌ను కూడా కైవసం చేసుకోలేదు. ఈసారి రోహిత్‌ సేనకు చరిత్రను తిరగరాసే ఛాన్స్‌ వచ్చింది. ఈ నేపథ్యంలోనే గావస్కర్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇక మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్ (Irfan Pathan) టీమ్ఇండియాకు మద్దతుగా నిలిచాడు. దక్షిణాఫ్రికాను వారి సొంతగడ్డపై ఓడిస్తే కెప్టెన్ రోహిత్‌ శర్మ పేరు భారతదేశ క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నాడు.

వన్డే ప్రపంచకప్‌ అనంతరం రోహిత్‌ వైట్‌ బాల్‌ ఫార్మాట్‌ నుంచి కాస్త విరామం తీసుకున్న విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు సూర్యకుమార్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. వన్డేలకు కేఎల్‌ రాహుల్‌ సారథ్యం వహిస్తున్నాడు. టెస్టు సిరీస్‌ను రోహిత్‌ నేతృత్వంలోనే టీమ్‌ఇండియా ఆడనుంది. మరోవైపు, ఇరు దేశాల మధ్య తొలి టీ20 వర్షార్పణం కాగా.. నేడు రెండో టీ20 కోసం టీమ్‌ఇండియా సిద్ధమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని