Sachin: బంతికి లాలాజలం.. సచిన్‌ కీలక వ్యాఖ్యలు

రెండేళ్ల కిందట కరోనా కారణంగా బంతికి లాలాజలం పూయడంపై ఐసీసీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా సచిన్‌ లాలాజలం వాడకంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. 

Published : 18 Mar 2023 01:55 IST

ఇంటర్నెట్ డెస్క్: గతంలో బంతికి మరింత షైనింగ్‌ కోసం ఆటగాళ్లు, బౌలర్లు లాలాజలం పూసేవారు. చెమటనూ దాని కోసం వినియోగించేవారు. అయితే, కరోనా కారణంగా ఉమ్మిని (లాలాజలం) వాడటంపై నిషేధం విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బంతికి లాలాజలం పూసేందుకు అనుమతి ఇవ్వాలని ఐసీసీకి సూచించాడు. కరోనా కాలంలో ఐసీసీ తీసుకున్న నిర్ణయం సరైందేనని, అయితే ఇప్పుడు మాత్రం  బౌలర్లకు వెసులుబాటు కల్పించాలని పేర్కొన్నాడు. పరిశుభ్రతకు సంబంధించి పలు ప్రశ్నలు లేవనెత్తడంపైనా సచిన్‌ స్పందించాడు. 

‘‘పరిశుభ్రత గురించి చాలామంది ఆలోచిస్తున్నారు. అయితే, బౌలర్లు చెమట కోసం బంతిని చంకల్లో పెడుతుంటారు. అది బాగుంటుందా..? అలాంటప్పుడు లాలాజలం పెట్టడంపై అభ్యంతరం ఎందుకు?  బంతి కొత్తగా ఉన్నప్పుడు లాలాజలం చాలా ముఖ్యం. చెమట కంటే లాలాజలానికి వ్యత్యాసం ఉంటుంది. ఒకవైపు ఎక్కువగా పెడతారు. మరోవైపు తక్కువగా వాడతారు. ఇలా బంతి సమతూకంగా లేకపోవడం వల్ల స్వింగ్‌ చేయడానికి అనుకూలంగా ఉంటుంది’’ అని సచిన్‌ తెలిపాడు. ఇంతకుముందు ఆసీస్‌ కెప్టెన్ ప్యాట్‌ కమిన్స్ కూడా ఇలాంటి సూచనలే చేశాడు. అయితే, ఐసీసీ అపెక్స్‌ కమిటీ మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని