Sanju Samson: సెంచరీ చేయడం గర్వంగానే ఉంది.. జట్టు గెలవడమే మరింత ఆనందం: సంజూ

దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్‌ను భారత్‌ (SA vs IND) నెగ్గడంలో సంజూ శాంసన్ అద్భుత శతకం కూడా కీలకమే. సఫారీ జట్టుపై మూడో వన్డేలో సెంచరీతో సంజూ అలరించాడు.

Updated : 22 Dec 2023 13:20 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డే కెరీర్‌లో భారత ఆటగాడు సంజూ శాంసన్‌ తొలి సెంచరీ నమోదు చేశాడు. దక్షిణాఫ్రికాపై (SA vs IND) సిరీస్‌ నెగ్గడంలో కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్‌లో అర్ష్‌దీప్‌ సింగ్ నాలుగు వికెట్ల ప్రదర్శన చేశాడు. దీంతో ‘ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌’గా సంజూ, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌’ అవార్డును అర్ష్‌దీప్‌ దక్కించుకున్నారు. చాలా రోజుల తర్వాత వన్డేల్లో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన సంజూపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. మ్యాచ్‌ అనంతరం అతడు మాట్లాడాడు.

‘‘ఎంతో గర్వంగా ఉంది. ఎమోషనల్‌గానూ ఉంది. మరీ ముఖ్యంగా కీలకమైన మ్యాచ్‌లో సెంచరీ సాధించడం ఆనందంగా ఉంది. మానసికంగా, శారీరకంగా చాలా రోజులు పడిన కష్టానికి ఫలితమిది. ఈ ఫార్మాట్‌లో క్రీజ్‌లో కుదురుకోవడానికి కాస్త సమయం ఉంటుంది. పిచ్‌ను అర్థం చేసుకోవడానికి.. బౌలర్ల మైండ్‌సెట్‌ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుంది. అంతేకాకుండా టాప్‌ ఆర్డర్‌లో రావడం వల్ల అదనంగా 10-20 బంతులు తీసుకోవడానికి వీలవుతుంది. యువ బ్యాటర్ తిలక్‌ వర్మ అద్భుతంగా ఆడాడు. దేశమంతా అతడి ఆటతీరు పట్ల గర్వపడుతోంది. సీనియర్లు రూపొందించిన ప్రమాణాలను యువ క్రికెటర్లు అందిపుచ్చుకున్నారు. ప్రతి రెండు రోజులకు ప్రయాణిస్తూ మ్యాచ్‌లు ఆడటం కఠిన సవాల్‌. అయినా యువ క్రికెటర్లు అదరగొట్టారు’’ అని సంజూ శాంసన్‌ వ్యాఖ్యానించాడు.

ఎల్బీ లేదా బౌల్డ్.. ఇదే మా ప్లాన్‌: అర్ష్‌దీప్‌

మూడు వన్డేల సిరీస్‌లో అర్ష్‌దీప్‌ సింగ్‌ మొత్తం 10 వికెట్లు పడగొట్టాడు. తొలి మ్యాచ్‌లో ఒక వికెట్‌ మాత్రమే తీసినా.. రెండో వన్డేలో ఐదు, చివరి మ్యాచ్‌లో నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. ‘‘రోజంతా పిచ్‌లో మార్పులేదు. మా ప్రణాళిక చాలా సింపుల్‌. వికెట్‌ టు వికెట్‌ బౌలింగ్‌ చేయడం. ఎల్బీగా పెవిలియన్‌కు చేర్చాలి లేదా బౌల్డ్‌ చేయాలనేది మా ప్లానింగ్‌. అది వర్కౌట్‌ అయింది. ఐపీఎల్ మాలాంటి కుర్రాళ్లకు అద్భుతమైన వేదిక. అంతర్జాతీయ క్రికెట్‌కు, ఐపీఎల్‌కు పెద్ద వ్యత్యాసం లేదు. అంతర్జాతీయ క్రికెటర్లను అర్థం చేసుకుంటే చాలు సులువుగా అడ్డుకోవచ్చు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాం’’ అని అర్ష్‌దీప్‌ వెల్లడించాడు.

మ్యాచ్‌కు సంబంధించి మరిన్ని విశేషాలు..

  • ఒక క్యాలెండర్‌ ఏడాదిలో అత్యధిక వన్డేలు గెలిచిన రెండో జట్టుగా భారత్‌ నిలిచింది. ఈ సంవత్సరం టీమ్‌ఇండియా 27 వన్డేల్లో విజయం సాధించింది. 30 వన్డేల విజయాలతో ఆస్ట్రేలియా ముందుంది.
  • దక్షిణాఫ్రికాతో ద్వైపాక్షిక సిరీసును భారత్‌ సొంతం చేసుకోవడం ఇది రెండోసారి మాత్రమే. చివరి సారిగా 2017-18 సీజన్‌లో 5-1 తేడాతో సిరీస్‌ను టీమ్‌ఇండియా గెలుచుకుంది.
  • వన్డేల్లో సౌతాఫ్రికాపై అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు అర్ష్‌దీప్‌ సింగ్‌ పేరిట నమోదయ్యాయి. రెండో వన్డేలో 5/37 బౌలింగ్‌ ప్రదర్శన చేశాడు. ఇప్పుడు మూడో మ్యాచ్‌లోనూ 4/30 గణాంకాలు నమోదు చేయడం విశేషం. 
  • దక్షిణాఫ్రికాపై వన్డేల్లో రెండుసార్లు 4+ వికెట్ల ప్రదర్శన చేసిన బౌలర్‌ అర్ష్‌దీప్‌. అతడి కంటే ముందు చాహల్‌ మూడుసార్లు ఈ ఫీట్‌ను సాధించాడు. ఒకే సిరీస్‌లో దక్షిణాఫ్రికాపై అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌ కూడా అర్ష్‌దీప్‌. ఈ సిరీస్‌లో 10 వికెట్లు తీశాడు. మాజీ బౌలర్‌ మునాఫ్‌ పటేల్ 2010/11 సిరీస్‌లో 11 వికెట్లు పడగొట్టాడు.
  • నాలుగో వికెట్‌ అంతకంటే దిగువన దక్షిణాఫ్రికాపై అత్యుత్తమ రెండో భాగస్వామ్యం సంజూ శాంసన్- తిలక్ వర్మదే (116). వీరి కంటే ముందు విరాట్ కోహ్లీ - సురేశ్ రైనా (2015లో 127 పరుగులు) జోడీ ఉంది.
  • సంజూ శాంసన్‌ దక్షిణాఫ్రికాపై వన్డేల్లో ఐదు ఇన్నింగ్స్‌ల్లో 238 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఒక హాఫ్‌ సెంచరీ ఉన్నాయి. దక్షిణాఫ్రికాలో భారత్‌ నమోదు చేసిన నాలుగో అత్యధిక స్కోరు(296/8) ఇదే. అంతకుముందు కెన్యాపై 2001లో పార్ల్‌ మైదానం వేదికగా 351/3 స్కోరు చేసింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని