Sanju Samson: ఆ ఒక్క బంతే మమ్మల్ని ఓడించింది.. రాజస్థాన్‌ కెప్టెన్ సంజూ శాంసన్

పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది రాజస్థాన్‌ జట్టు. అయితే, ఈ ఐపీఎల్‌ సీజన్‌లో తొలి ఓటమిని రుచి చూసింది. అదీనూ సొంత మైదానం జైపుర్‌లో కావడం గమనార్హం.

Published : 11 Apr 2024 14:53 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌ 17వ సీజన్‌లో రాజస్థాన్‌కు తొలి ఓటమి ఎదురైంది. గుజరాత్‌ చేతిలో మూడు వికెట్ల తేడాతో రాజస్థాన్‌ పరాజయం పాలైంది. గుజరాత్ బ్యాటర్ రషీద్ ఖాన్ చివరి బంతికి ఫోర్ కొట్టి తన జట్టును గెలిపించాడు. మ్యాచ్‌ అనంతరం తమ ఓటమిపై కెప్టెన్‌ సంజూ శాంసన్‌ (Sanju Samson) కీలక వ్యాఖ్యలు చేశాడు. 197 పరుగులను గుజరాత్‌ ఎదుట రాజస్థాన్‌ ఉంచగా, మూడు వికెట్ల తేడాతో గుజరాత్ గెలిచింది.

‘‘మీరు ఎక్కడ మ్యాచ్‌ను కోల్పోయారని భావిస్తున్నారు?’’ - కామెంటేటర్‌

‘‘గేమ్‌లోని చివరి బంతి వల్లే మేం ఓడిపోయాం’’ - సంజూ శాంసన్.. ‘‘అవునా..!’’ అంటూ కామెంటేటర్‌ ఆశ్చర్యపోతూ ప్రతిస్పందించాడు. 

ఆ తర్వాత సంజూ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటప్పుడు మాటలు కూడా రావడం లేదు. ఓటమిపై స్పందించడమే టోర్నీలో కెప్టెన్‌కు అత్యంత క్లిష్టమైన సమయం. ఎక్కడ ఓడిపోయామని చెప్పడమూ కష్టమే. ఓటమి బాధ తగ్గినప్పుడే స్పష్టంగా చెప్పగలను. మ్యాచ్‌ విజయం సాధించిన గుజరాత్‌కే ఈ క్రెడిట్‌ ఇస్తా. మాకు ఎదురైన తొలి ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటాం. నేను బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు 180 పరుగులు చేసినా మంచి లక్ష్యమే అవుతుందని భావించా. చివరికి మేం 196 పరుగులను టార్గెట్‌గా నిర్దేశించాం. మంచు ప్రభావం లేకపోవడం, బౌలింగ్‌ లైనప్‌తో సులువుగా గెలుస్తామని అనుకున్నా. కానీ గుజరాత్ అద్భుతంగా ఆడింది.’’ అని సంజూ తెలిపాడు. 

మరికొన్ని మ్యాచ్‌ విశేషాలు..

  • చివరి బంతికి అత్యధిక టార్గెట్‌ను విజయవంతంగా పూర్తి చేయడం ఇది మూడోసారి. ఇప్పుడు 197 పరుగులు టార్గెట్‌ కాగా.. 2022 సీజన్‌లో హైదరాబాద్‌పై 196, పంజాబ్‌పై 190 పరుగులు చేసి గెలిచింది.
  • ఐపీఎల్‌లో చివరి బంతికి ఓడిపోవడం రాజస్థాన్‌కు ఇది నాలుగోసారి. లక్ష్య ఛేదనలో గుజరాత్‌ విజయవంతంగా పూర్తి చేసిన రెండో మ్యాచ్‌ కూడా ఇదే. అంతకుముందు బెంగళూరుపై 2023లో 198 పరుగులు చేసి విజయం సాధించింది. 
  • జైపుర్‌లో అత్యధిక టార్గెట్లను విజయవంతంగా పూర్తిచేసిన రెండో జట్టు గుజరాత్. అంతకుముందు రాజస్థాన్‌పై హైదరాబాద్‌ (2023)లో 215 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.
  • ఐపీఎల్‌లో గుజరాత్‌ 22 మ్యాచుల్లో లక్ష్య ఛేదనకు దిగి 16 మ్యాచుల్లో గెలిచింది. మరో ఆరింట్లో ఓటమి పాలైంది. 
  • శుభ్‌మన్‌ గిల్ ఐపీఎల్‌లో 3000 మార్క్‌ను దాటాడు. అత్యంత వేగంగా సాధించిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు. అతడికంటే ముందు విరాట్ కోహ్లీ ఉన్నాడు. గిల్ 94 ఇన్నింగ్స్‌ల్లో ఈ మార్క్‌ను అందుకొన్నాడు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని