Serena Williams: వార్తలో తన బదులు అక్క ఫొటో... న్యూయార్క్‌ టైమ్స్‌కు సెరీనా కౌంటర్‌

మీరు మరింత మంచి పాత్రికేయం చేయగలరంటూ అమెరికా టెన్నిస్‌ దిగ్గజం సెరీనా విలియమ్స్‌.. ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘ది న్యూయార్క్‌ టైమ్స్‌’ దినపత్రికకు కౌంటర్‌ ఇచ్చారు...

Updated : 03 Mar 2022 15:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మీరు మరింత మంచి పాత్రికేయం చేయగలరంటూ అమెరికా టెన్నిస్‌ దిగ్గజం సెరీనా విలియమ్స్‌.. ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘ది న్యూయార్క్‌ టైమ్స్‌’ దినపత్రికకు కౌంటర్‌ ఇచ్చారు. బుధవారం సదరు పత్రిక ‘సెరీనా వెంచర్స్‌’ సంస్థకు చెందిన ఓ వార్తా కథనంలో ఆమెకు బదులు తన సోదరి వీనస్‌ విలియమ్స్‌ ఫొటోను ప్రచురించడమే అందుకు కారణం. తొలుత ఈ విషయాన్ని నెటిజన్లు పసిగట్టగా తర్వాత సెరీనా స్పందిస్తూ ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ను ట్యాగ్‌ చేస్తూ ఓ ట్వీట్‌ చేసింది.

‘మనం ఎంత ఎత్తుకు ఎదిగినా అది చాలదన్నట్లు కొన్ని విషయాలు మనకు గుర్తు చేస్తూ ఉంటాయి. పక్షపాత ధోరణితో వ్యవస్థల ద్వారా వివక్షకు గురైన కొందరికి అండగా ఉండేందుకు ‘సెరీనా వెంచర్స్‌’ తరఫున నేను 111 మిలియన్‌ డాలర్ల ఫండ్‌ను సమీకరించాను. ఎందుకంటే నేను కూడా వివక్షకు గురైన బాధితురాలినే. న్యూయార్క్‌ టైమ్స్‌ మీరు మరింత మంచి పాత్రికేయం చేయగలరని ఆశిస్తున్నా’ అని  ఘాటుగా స్పందించింది.

సెరీనా ఇటీవలే ఆమె పేరిట ఓ పెట్టుబడుల సంస్థను స్థాంపించిందని, దానికి 111 మిలియన్‌ డాలర్ల నిధులను సమీకరించిందని ఆ పత్రిక కథనంలో రాసుకొచ్చింది. అయితే, అందులో సెరీనాకు బదులు వీనస్‌ ఫొటోను ప్రచురించగా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు సెరీనా ఈ మధ్య టెన్నిస్‌లో  అంత చురుగ్గా లేరనే సంగతి తెలిసిందే. గతేడాది వింబుల్డన్‌ పోటీల్లో తొలిరౌండ్‌లో ఓటమిపాలయ్యాక మళ్లీ రాకెట్‌ పట్టలేదు. ఇక జనవరిలో జరిగిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లోనూ పాల్గొనలేదు. దీంతో తాజా ర్యాంకింగ్స్‌లో ఆమె టాప్‌ 50లో చోటు కోల్పోయారు. 2006 తర్వాత ఇలా జరగడం తొలిసారి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని