Mithali Raj: యువ అథ్లెట్లకు మిథాలీ రాజ్‌ స్ఫూర్తి: ప్రధాని నరేంద్ర మోదీ

మహిళా క్రికెట్‌ దిగ్గజం మిథాలీ రాజ్‌ ఇటీవల అన్ని ఫార్మాట్ల అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 23 ఏళ్లపాటు టీమ్‌ఇండియా తరఫున ఆడి మహిళా క్రికెట్‌ ఖ్యాతిని పెంచిన మిథాలీకి

Updated : 26 Jun 2022 22:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్: మహిళా క్రికెట్‌ దిగ్గజం మిథాలీ రాజ్‌ ఇటీవల అన్ని ఫార్మాట్ల అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 23 ఏళ్లపాటు టీమ్‌ఇండియా తరఫున ఆడి మహిళా క్రికెట్‌ ఖ్యాతిని పెంచిన మిథాలీకి కృతజ్ఞతలు తెలుపుతూ ప్రపంచం నలుమూలల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా మిథాలీ రాజ్‌ను అభినందించారు. మన్ కీ బాత్‌ కార్యక్రమంలో మిథాలీ గురించి మోదీ ప్రస్తావించారు. దేశంలోని యువ అథ్లెట్లకు ఆమె స్ఫూర్తిగా నిలిచి వారిని ప్రభావితం చేశారన్నారు.

‘క్రీడల విషయానికి వస్తే నేనొకటి చెప్పదల్చుకున్నా. భారతదేశం తరఫున అత్యంత ప్రతిభావంతులైన క్రికెటర్లలో ఒకరైన మిథాలీ రాజ్ గురించి నేను ఇవాళ ప్రస్తావించాలనుకుంటున్నా. ఆమె ఈ నెల ప్రారంభంలో తన రిటైర్మెంట్ ప్రకటించింది. ఇది చాలా మంది అభిమానులను భావోద్వేగానికి గురి చేసింది. మిథాలీ అసాధారణ క్రీడాకారిణి మాత్రమే కాదు.. ఎంతోమంది యువ ఆటగాళ్లకు స్ఫూర్తి. మిథాలీ తదుపరి భవిష్యత్తుకు నేను శుభాకాంక్షలు తెలుపుతున్నా’ అని ప్రధాని మోదీ ముగించారు.

సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో విలువైన ఇన్నింగ్స్‌ ఆడిన 39 ఏళ్ల మిథాలీ 232 వన్డేల్లో 7805 పరుగులు చేసింది. ఆమె 89 టీ20 మ్యాచ్‌లు కూడా ఆడింది. కేవలం 12 టెస్టులే ఆడినా.. ఓ డబుల్‌ సెంచరీ చేసింది. ఆ ఘనత సాధించిన ఏకైక భారత మహిళ మిథాలీనే. ఆమె 2019లో టీ20 క్రికెట్‌ నుంచి రిటైరైంది. వన్డే ప్రపంచకప్‌ అనంతరం వీడ్కోలు పలుకుతా అని మిథాలీ ముందే చెప్పింది. మార్చిలో జరిగిన ఆ ఈవెంట్లో ఆమె జట్టుకు నాయకత్వం వహించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని