NZ vs SA: న్యూజిలాండ్‌ ఘోర పరాజయం.. అగ్రస్థానంలోకి దూసుకెళ్లిన సౌతాఫ్రికా

ప్రపంచకప్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఘోర పరాజయం పాలైంది. కివీస్‌పై 190 పరుగుల తేడాతో సౌతాఫ్రికా భారీ విజయం సాధించింది.

Updated : 01 Nov 2023 21:23 IST

పుణె: ప్రపంచకప్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఘోర పరాజయం పాలైంది. కివీస్‌పై 190 పరుగుల తేడాతో సౌతాఫ్రికా భారీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్య ఛేదనలో సఫారీల ధాటికి కివీస్ కనీస ప్రతిఘటన కూడా చేయకుండా 35.3 ఓవర్లలో 167 పరుగులకే కుప్పకూలింది. గ్లెన్ ఫిలిప్స్‌ (60; 50 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఒక్కడే పోరాడాడు. విల్ యంగ్ (33), డారిల్ మిచెల్ (24) పరుగులు చేశారు. మిగతా ప్లేయర్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. డేవాన్ కాన్వే (2), రచిన్‌ రవీంద్ర (9), టామ్ లేథమ్ (4), మిచెల్ శాంట్నర్  (7), జేమ్స్ నీషమ్ (0) తీవ్ర నిరాశపర్చారు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్‌ 4, మార్కో జాన్సన్ 3, గెరాల్డ్ కోయెట్జీ 2, కగిసో రబాడ ఒక వికెట్ పడగొట్టారు. ఈ భారీ విజయంతో నెట్‌రన్‌రేట్‌ను మరింత మెరుగుపర్చుకుని సౌతాఫ్రికా పాయింట్ల పట్టికలో భారత్‌ను వెనక్కినెట్టి అగ్రస్థానానికి దూసుకెళ్లింది.

సౌతాఫ్రికా బ్యాటర్లలో ఓపెనర్ క్వింటన్ డికాక్ (114; 116 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) మరోసారి చెలరేగాడు. ఈ ప్రపంచకప్‌లో అతడికిది నాలుగో సెంచరీ. వాండర్‌ డసెన్ (133; 118 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) కూడా శతకం బాదాడు. ఓపెనర్ తెంబా బావుమా (24) పరుగులు చేయగా.. చివర్లో డేవిడ్‌ మిల్లర్ (53; 30 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడి అర్ధ శతకం సాధించాడు. కివీస్‌ బౌలర్లలో టిమ్ సౌథీ 2, ట్రెంట్ బౌల్ట్, నీషమ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని