RSA vs ENG: చెలరేగిన సఫారీలు.. ఇంగ్లాండ్‌ ఎదుట కొండంత లక్ష్యం

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ ముగిసింది. 400 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 

Published : 21 Oct 2023 18:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ ముగిసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సఫారీ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. క్లాసేన్‌ (109; 67 బంతుల్లో 12×4,4×6) శతకంతో చెలరేగాడు. హెన్రిక్స్‌ (85; 75 బంతుల్లో 9×4, 3×6), డస్సేన్‌ (60; 61 బంతుల్లో 8×4) అర్ధశతకాలు సాధించారు. జాన్సేన్‌ (75*; 42 బంతుల్లో 3×4,6×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో టాప్లే 3 వికెట్లు పడగొట్టగా.. అదిల్‌ రషీద్‌ , అట్కిన్‌సన్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. 

బ్యాటింగ్‌ ప్రారంభించిన సౌతాఫ్రికాకు ఆదిలోనే షాక్‌ తగిలింది. ఓపెనర్‌ డీకాక్‌ (4) స్వల్ప స్కోరుకే ఔటయ్యాడు. టాప్లే బౌలింగ్‌లో జోస్‌ బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. తొలి డౌన్‌లో వచ్చిన డస్సేన్‌తో కలిసి మరో ఓపెనర్‌ హెన్రిక్స్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 125 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని రషీద్‌ విడగొట్టాడు. 19.4వ బంతికి బయిర్‌స్టోకు క్యాచ్‌ ఇచ్చి డస్సేన్‌ వెనుదిరిగాడు. రెండో డౌన్‌లో వచ్చిన మార్‌క్రమ్‌ (42) అర్ధశతకానికి చేరువలో టోప్లే బౌలింగ్‌లోనే బెయిర్‌స్టోకు క్యాచ్‌ ఇచ్చాడు.
 
క్లాసేన్‌ క్రీజులోకి వచ్చిన తర్వాత ఆట స్వరూపమే మారిపోయింది. వరుస ఫోర్లు, సిక్సర్లతో ఇంగ్లాండ్‌ను బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఓవైపు హెన్రిక్స్‌, డేవిడ్ మిల్లర్‌ ఔటైనప్పటికీ రన్‌రేట్‌ ఏమాత్రం తగ్గనివ్వలేదు. అయితే, సెంచరీ పూర్తి చేసుకున్న క్లాసేన్‌ను ఆట్కిన్‌సన్‌ పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత ఆట కాస్త నెమ్మదించింది. చివర్లో జాన్‌సేన్‌ మెరుపు ఇన్నింగ్స్‌ ఆడటంతో ఇంగ్లాండ్‌ ఎదుట దక్షిణాఫ్రికా భారీ లక్ష్యాన్ని ఉంచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని