Team India: వారు రంజీల్లో ఆడాల్సిందే.. ఈ యువ బ్యాటర్‌ వేగంగా నేర్చుకొనే ప్లేయర్‌: సన్నీ

ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో (IND vs ENG) భారత ప్రదర్శనపై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. విజయం సాధించినప్పటికీ కొందరు విఫలం కావడం బాధాకరమని పేర్కొన్నాడు.

Published : 07 Feb 2024 10:50 IST

ఇంటర్నెట్ డెస్క్: రెండో టెస్టులో (IND vs ENG) ఇంగ్లాండ్‌ను చిత్తు చేయడంలో బౌలింగ్‌ పరంగా బుమ్రా కీలక పాత్ర పోషిస్తే.. బ్యాటింగ్‌లో యశస్వి జైస్వాల్, శుభ్‌మన్‌ గిల్ అదరగొట్టేశారు. మరీ ముఖ్యంగా యశస్వి (209) డబుల్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ యువ బ్యాటర్‌పై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇతర బ్యాటర్లు తమ వికెట్లను ఇంగ్లాండ్‌ బౌలర్లకు బహుమతిగా ఇస్తే.. యశస్వి ఒక్కడే వారిపై ఆధిపత్యం ప్రదర్శించాడని కొనియాడాడు. 

‘‘తొలి టెస్టులో చేజారిన సెంచరీని రెండో టెస్టులో మూడంకెల స్కోరుగా మలిచాడు. కెరీర్‌లో తొలి ద్విశతకం పూర్తి చేసుకున్నాడు. యశస్విని చూస్తుంటే చాలా వేగంగా నేర్చుకొనే ఆటగాడిగా అనిపిస్తున్నాడు. టీమ్‌ఇండియాకు ఇలాంటి భారీ ఇన్నింగ్స్‌లు అవసరం. ఎవరో ఒకరు భారీగా పరుగులు చేస్తేనే మ్యాచ్‌పై పట్టు సాధించేందుకు అవకాశం దక్కుతుంది. తొలి టెస్టులో మాదిరిగా రెండో మ్యాచ్‌లోనూ చాలా మంది భారత ఆటగాళ్లు తమ వికెట్లను ఇంగ్లాండ్ బౌలర్లకు అప్పనంగా సమర్పించారు. ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలిచినప్పటికీ.. కొందరి ఫామ్‌ ఆందోళనకరంగానే ఉంది. మిగతా టెస్టుల్లోనూ ఇదే విధమైన ఆటతీరును ప్రదర్శిస్తే మొదటికే మోసం వస్తుంది. ఇంగ్లాండ్‌పై ఒత్తిడిని కొనసాగిస్తేనే సిరీస్‌ మనదవుతుంది’’ అని సునీల్ గావస్కర్ వ్యాఖ్యానించాడు.

రంజీల్లో ఆడితేనే ఫామ్‌లోకి వస్తారు..

‘‘ఫామ్‌ కోల్పోయిన ప్రతి ఒక్కరూ రంజీల్లో ఆడి పరుగులు సాధించాలి. అప్పుడే వారికి నమ్మకం వస్తుంది. భారీ టెస్టు సిరీస్‌లో వరుసగా విఫలం కావడం తీవ్ర నిరుత్సాహానికి గురి చేస్తోంది. ఇప్పటికే రంజీ ట్రోఫీ జరుగుతోంది. విఫలమవుతున్న వారికి ఇది అద్భుత అవకాశం. టెస్టు సిరీసుల్లో రాణించాలంటే ముందు రంజీల్లో కొన్ని మ్యాచ్‌లు ఆడాలి’’ అని తెలిపాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని