
T20 World Cup: ఆసీస్‌కు స్వల్ప లక్ష్యం నిర్దేశించిన దక్షిణాఫ్రికా
అబుదాబి: అసలుసిసలైన టీ20 ప్రపంచకప్ సూపర్-12 పోటీలు ప్రారంభమయ్యాయి. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. మిడిలార్డర్ బ్యాటర్ మారక్రమ్ (40) ఫర్వాలేదనిపించడంతో ఓ మోస్తరుస్కోరును సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. దీంతో కంగారూల జట్టుకు 119 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆసీస్ బౌలర్లలో హేజిల్‌వుడ్ 2, జంపా 2, స్టార్క్ 2.. మాక్స్‌వెల్, కమిన్స్ చెరో వికెట్ పడగొట్టారు.
ఆదుకున్న మారక్రమ్
ఆదినుంచే ఆసీస్ బౌలర్ల ధాటికి సౌతాఫ్రికా బ్యాటింగ్ లైనప్ కకావికలమైంది. ఓపెనర్, కెప్టెన్ టెంబా బవుమా (12) ధాటిగా ఇన్నింగ్స్‌ను ఆరంభించినా ఆదే ఊపును కొనసాగించలేకపోయాడు. స్వల్ప వ్యవధిలో దక్షిణాఫ్రికా వికెట్లను చేజార్చుకుంది. అయితే ఒకవైపు వికెట్లు పడుతున్నా సౌతాఫ్రికా బ్యాటర్ మారక్రమ్ (40) మాత్రం నిలకడగా ఆడుతూ మిల్లర్ (16)తో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకు ప్రయత్నించాడు. మిల్లర్ ఔటైన తర్వాత వచ్చిన బ్యాటర్లు వరుసగా పెలివియన్ బాటపట్టారు. దీంతో చివర్లో దూకుడుగా ఆడేందుకు మారక్రమ్ యత్నించడంతో ఆసీస్ చేతికి చిక్కాడు. ఆఖర్లో రబాడ (19*) బ్యాట్‌ను ఝళిపించాడు. డికాక్ 7, డస్సెన్ 2, క్లాసెన్ 13, డేవిడ్ మిల్లర్ 16, ప్రిటోరియస్ 1, నార్జే 2 పరుగులు చేశారు.