T20 World Cup: టీ20 క్రికెట్‌లో దక్షిణాఫ్రికా స్పిన్నర్‌ కొత్త రికార్డు

టీ20 క్రికెట్‌లో దక్షిణాఫ్రికా స్పిన్నర్‌  తబ్రెయిజ్‌ షంసీ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక వికెట్లు (32) పడగొట్టిన ఆటగాడిగా నిలిచి సరికొత్త రికార్డును నెలకొల్పాడు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన

Published : 31 Oct 2021 01:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 క్రికెట్‌లో దక్షిణాఫ్రికా స్పిన్నర్‌ తబ్రెయిజ్‌ షంసీ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక వికెట్లు (32) పడగొట్టిన ఆటగాడిగా నిలిచి సరికొత్త రికార్డును నెలకొల్పాడు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్లు సాధించి ఈ రికార్డును అందుకున్నాడు. ఇక, ఐసీసీ టి20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో షంసీ ప్రస్తుతం నెంబర్‌వన్‌ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్‌ ఆండ్రూ టై 2018 క్యాలండర్‌ ఇయర్‌లో 31 వికెట్లు సాధించాడు. ఈ రికార్డును షంసీ బద్దలు కొట్టాడు. షంసీ 2017లో టీ20ల్లో అరంగేట్రం చేశాడు. ఓవరాల్‌గా దక్షిణాఫ్రికా తరపున 45 టీ20ల్లో 53 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది ప్రారంభంలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 4/25 అత్యుత్తమ ప్రదర్శన చేశాడు.

ఇక, ఈ టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా రెండో విజయాన్ని నమోదు చేసింది. శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో నెగ్గింది. లంక నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా 19.5 ఓవర్లలో ఛేదించింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో కెప్టెన్‌ బావుమా (46) రాణించగా.. మార్‌క్రమ్‌ (19) ఫర్వాలేదనిపించాడు. చివర్లో విజయానికి కావాల్సిన పరుగులు ఎక్కువ ఉండడంతో కాస్త ఉత్కంఠ నెలకొంది. అయితే, డేవిడ్‌ మిల్లర్ (23; 13 బంతుల్లో 2 సిక్స్‌లు), రబాడ (13; 7 బంతుల్లో 1 ఫోర్‌, ఒక సిక్స్‌) వేగంగా ఆడి జట్టుకు విజయాన్ని అందించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని