Team India: భారత క్రికెట్‌ చరిత్రలో అరుదైన ఫీట్‌..

టీమ్‌ఇండియా అరుదైన ఫీట్‌ సాధించింది. వన్డే, టీ20, టెస్టు మూడు ఫార్మాట్లలో భారత్‌ క్రికెట్‌ జట్టు ర్యాకింగ్స్‌లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.

Published : 23 Sep 2023 01:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వరల్డ్‌ కప్‌ (ODI World Cup 2023) ముంగిట భారత్‌కు అన్నీ శుభశకునాలే. ఇటీవల ఆసియా కప్‌ గెలిచిన సంబరం మరువకముందే.. తాజాగా ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ అన్ని ఫార్మాట్లలో భారత్‌ టాపర్‌గా నిలిచింది. ఆసీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించింది. దీంతో సిరీస్‌ను ఘనంగా ప్రారంభించడమే కాకుండా.. తాజాగా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లోనూ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ప్రస్తుతం 116 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌ను సాధించగా.. పాకిస్థాన్‌ (115), ఆస్ట్రేలియా (111) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఆసీస్‌తో సిరీస్‌ను నెగ్గితే వరల్డ్‌ కప్‌నకు అగ్రస్థానంతో బరిలోకి దిగే అవకాశం భారత్‌కు ఉంటుంది.

  • ఇప్పటికే భారత్ టెస్టు, టీ20 ఫార్మాట్‌లో తొలి ర్యాంకులో నిలిచిన సంగతి తెలిసిందే. ఆసీస్‌తో బోర్డర్‌- గావస్కర్‌ సిరీస్‌ను గెలుచుకోవడం, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరుకోవడం, విండీస్‌తో టెస్టు సిరీస్‌ నెగ్గడంతో టెస్టుల్లో భారత్ (118 పాయింట్లు) మొదటి స్థానానికి చేరుకుంది. టీమ్‌ఇండియా తర్వాత టెస్టుల్లో ఆస్ట్రేలియా (118), ఇంగ్లాండ్‌ (115) కొనసాగుతున్నాయి. 
  • గతేడాది టీ20 సెమీ ఫైనల్‌కు చేరుకోవడం, ద్వైపాక్షిక సిరీసుల్లోనూ ఉత్తమ ప్రదర్శన చేయడంతో టీ20ల్లోనూ భారత్‌ అగ్రస్థానానికి చేరుకుంది. టీ20 ప్రపంచ కప్‌ 2021 నుంచి ఇప్పటి వరకు మొత్త 14 సిరీసుల్లో కేవలం ఒక్క సిరీస్‌ను మాత్రమే టీమ్‌ఇండియా చేజార్చుకుంది. దీంతో భారత్ (264 పాయింట్లు), ఇంగ్లాండ్ (261), పాకిస్థాన్ (254) టాప్‌ -3లో నిలిచాయి.
  • ఇలా మూడు ఫార్మాట్లలో భారత్‌ అగ్రస్థానం చేరుకోవడం ఇదే తొలిసారి. భారత్‌ కంటే ముందు 2012లో దక్షిణాఫ్రికా ఈ ఘనతను సొంతం చేసుకుంది. ఇప్పుడు భారత్‌ ఆ జాబితాలో చేరింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని