Pujara: నేను ఓ పది నిమిషాలు క్రీజ్‌లో ఉంటే చాలు..: పుజారా

వందో టెస్టు మ్యాచ్‌లో భారీగా పరుగులు చేయనప్పటికీ.. పుజారాకిది (Pujara) చిరస్మరణీయంగా మారిపోయంది. అనూహ్యరీతిలో ఆసీస్‌పై భారత్‌ (IND vs AUS) అద్భుత విజయం సాధించింది.

Published : 20 Feb 2023 01:33 IST

ఇంటర్నెట్ డెస్క్‌: బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో (Border - Gavaskar Trophy) భారత్ అదరగొట్టేస్తోంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో ఆసీస్‌పై టీమ్‌ఇండియా రెండో టెస్టులోనూ విజయం సాధించింది. కేవలం మూడున్నర రోజుల్లోనే ముగిసిన టెస్టులో భారత్‌ అనూహ్యంగా పుంజుకొని మరీ విజయం సాధించడం గమనార్హం. టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్ ఛెతేశ్వర్ పుజారాకిది (Pujara) వందో టెస్టు.. అదీనూ విన్నింగ్‌ షాట్ కొట్టే ఛాన్స్‌ కూడా పుజారాకే దక్కడం విశేషం. మ్యాచ్‌ అనంతరం పుజారా ప్రత్యేకంగా మాట్లాడాడు. అంతకుముందు పుజారాకు ఆసీస్‌ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ తమ ఆటగాళ్ల సంతకాలతో కూడిన జెర్సీని బహూకరించాడు. 

‘‘ఇదొక అద్భుతమైన టెస్టు మ్యాచ్‌. అయితే, తొలి ఇన్నింగ్స్‌లో దురదృష్టవశాత్తూ పరుగులేమీ చేయలేకపోయా. ఓ పది నిమిషాలు క్రీజ్‌లో ఉంటే చాలు నేను రన్స్‌ చేస్తానని నాకు తెలుసు. వందో టెస్టులో విజయం సాధించిన అనుభూతి ప్రత్యేకంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానుల సమక్షంలో విన్నింగ్‌ షాట్‌ కొట్టడం ఆనందంగా ఉంది. మిగతా రెండు టెస్టుల్లోనూ ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. ఈ మ్యాచ్‌లో మేం 200 నుంచి 250 పరుగుల వరకు ఛేదించాల్సి ఉంటుందని భావించాం. దాని కోసం సన్నద్ధమయ్యాం. రెండో రోజో చివరి సెషన్‌లో మేం కొంచెం ఎక్కువగా పరుగులు ఇచ్చాం. అయితే ఇవాళ మాత్రం మా బౌలర్లు అదరగొట్టారు. స్వీప్‌ షాట్లను కొట్టాలని ముందే అనుకోలేదు. కానీ, తక్కువ బౌన్స్‌ కావడంతో ఇదే బెటర్‌ అని భావించా. దీని కోసం చాలా సాధన చేశా. ఇలాంటి పిచ్‌ మీద చాలా జాగ్రత్తగా ఆడాల్సి ఉంది.  కొన్ని బంతులు తిరుగుతుంటాయి. మరికొన్ని వికెట్‌కు నేరుగా వస్తుంటాయి. అందుకే ఆత్మవిశ్వాసంతో షాట్లు ఆడాలి. రంజీ ట్రోఫీని గెలిచిన సౌరాష్ట్ర జట్టు సభ్యులకు అభినందనలు. ’’ అని పుజారా తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని