Asia Cup 2023: చెలరేగిన రోహిత్‌, గిల్‌.. నేపాల్‌ను చిత్తుచేసి సూపర్‌-4కు దూసుకెళ్లిన భారత్‌

ఆసియా కప్‌లో భాగంగా నేపాల్‌ జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 10 వికెట్ల తేడాతో గెలుపొంది సూపర్‌-4కు దూసుకెళ్లింది. వర్షం అంతరాయం వల్ల మ్యాచ్‌ను 23 ఓవర్లలో 145 పరుగులుగా నిర్దేశించారు. రోహిత్‌ శర్మ(74*), శుభుమన్‌ గిల్‌(67*) అర్ధశతకాలతో చెలరేగి వికెట్‌ కోల్పోకుండా భారత్‌ను గెలిపించారు.   

Updated : 04 Sep 2023 23:56 IST

పల్లెకెలె: ఆసియా కప్‌లో భాగంగా పసికూన నేపాల్‌ను ఓడించి భారత్‌ సూపర్‌-4కు దూసుకెళ్లింది. వర్షం కారణంగా 23 ఓవర్లలో 145 పరుగులకు కుదించిన మ్యాచ్‌లో భారత్‌ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్.. 48.2 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం భారత్‌ లక్ష్యఛేదనలో 2.1 ఓవర్ల ఆట పూర్తయిన తర్వాత వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ నిలిచిపోయింది. వర్షం తగ్గిన అనంతరం డక్‌వర్త్ లూయిస్ ప్రకారం భారత్ లక్ష్యాన్ని 23 ఓవర్లలో 145గా నిర్దేశించారు. రోహిత్ శర్మ (74*), శుభ్‌మన్‌ గిల్ (67*) దంచికొట్టడంతో ఈ టార్గెట్‌ని టీమ్‌ఇండియా 20.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఛేదించింది. 

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్.. ఊహించిన దాని కంటే మంచి స్కోరే సాధించింది. వర్షం అంతరాయం నడుమ ఆ జట్టు 48.5 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు కుశాల్ బార్టెల్ (38; 25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), అసిఫ్‌ షేక్ (58; 97 బంతుల్లో 8 ఫోర్లు) రాణించారు. లోయర్ ఆర్డర్ బ్యాటర్ సోమ్‌పాల్ (48; 56 బంతుల్లో) కూడా మెరిశాడు. గుల్షాన్‌ జా (23), దీపేంద్ర సింగ్ (29) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. 146 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయిన నేపాల్.. 180లోపే ఆలౌటయ్యే కనిపించింది. కానీ, సోమ్‌పాల్ పట్టుదలగా ఆడటంతో పోరాడే స్కోరు సాధించింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 3, సిరాజ్ 3, షమి, హార్దిక్ పాండ్య, శార్దూల్ ఠాకూర్‌ తలో వికెట్ పడగొట్టారు. 

భారత్  vs పాక్ మ్యాచ్‌ మళ్లీ..  

గ్రూప్ ఎ నుంచి పాకిస్థాన్, భారత్ సూపర్-4 దశకు అర్హత సాధించడంతో ఈ ఇరుజట్లు మరోసారి తలపడనున్నాయి. సెప్టెంబరు 10న దాయాదుల పోరు ఉండనుంది. గ్రూప్ బిలో ఇంకా సూపర్-4 బెర్త్‌లు ఖరారు కాలేదు. మంగళవారం శ్రీలంక, అఫ్గానిస్థాన్‌ మ్యాచ్‌తో గ్రూప్‌ బిలో సూపర్‌-4 ఖరారు కానున్నాయి. ఈ గ్రూప్‌లో ప్రస్తుతం శ్రీలంక, బంగ్లాదేశ్‌ రెండేసి పాయింట్లతో పట్టికలో వరుసగా ఒకటి, రెండు స్థానాల్లో ఉన్నాయి. శ్రీలంకపై అఫ్గాన్‌ గెలిస్తే మూడు జట్ల పాయింట్లు సమం అవుతాయి. అప్పుడు నెట్‌ రన్‌రేట్ మెరుగ్గా ఉన్న రెండు జట్లు ముందజ వేస్తాయి. ఇలా కాకుండా అఫ్గాన్‌ను శ్రీలంక ఓడిస్తే.. లంకతోపాటు బంగ్లాదేశ్‌ సూపర్‌-4కు వెళ్తాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని