Nick Compton on Virat Kohli: ‘కోహ్లీ నోరు తెరిస్తే బూతు మాటలే’: కాంప్టన్‌పై విమర్శల వర్షం

‘కోహ్లీ నోరు తెరిస్తే బూతు మాటలే..’ అంటూ ట్వీట్‌ చేసిన ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ నిక్‌ కాంప్టన్‌పై భారత అభిమానులు విమర్శలు కురిపిస్తున్నారు...

Published : 19 Aug 2021 10:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘కోహ్లీ నోరు తెరిస్తే బూతు మాటలే..’ అంటూ ట్వీట్‌ చేసిన ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ నిక్‌ కాంప్టన్‌పై భారత అభిమానులు విమర్శలు కురిపిస్తున్నారు. మరి ఇంగ్లాండ్‌ క్రీడాకారులు బుమ్రాను దూషించినప్పుడు నోరెందుకు తెరవలేదని ప్రశ్నిస్తున్నారు. అండర్సన్‌ అశ్లీల పదజాలం వాడినప్పుడు వినపడలేదా అని ఘాటుగా బదులిస్తున్నారు.

ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో ఆటగాళ్లు పరస్పరం కవ్వించుకున్న సంగతి తెలిసిందే. బుమ్రాను లక్ష్యంగా ఎంచుకొని అండర్సన్‌, బట్లర్‌ మిగిలిన క్రీడాకారులు దూషించారు. పదేపదే కవ్వించారు. ఆ తర్వాత టీమ్‌ఇండియా ఏమాత్రం తగ్గకుండా ఘాటుగా బదులిచ్చింది. అటు మాటలు బదులివ్వడమే కాకుండా ఆటలోనూ తిరుగులేని ప్రదర్శన చేసింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మైదానంలో చురుగ్గా కదులుతూ ఆటగాళ్లను ఉత్సాహపరిచాడు.

‘నోరు తెరిస్తే విరాట్‌ కోహ్లీ కన్నా ఎక్కువ బూతులు మాట్లాడే వ్యక్తి మరొకరు ఉండరు కదా! 2012లో నన్ను వేలెత్తి చూపుతూ చేసిన దూషణను మర్చిపోలేను. అలా చేసి తనను తానే తక్కువ చేసుకున్నాడు. దీనివల్ల జోరూట్‌, తెందుల్కర్‌, విలియమ్సన్‌ ఎంత హుందాగా ఉంటారో తెలుస్తోంది’ అని కాంప్టన్‌ ట్వీట్‌ చేశాడు. దీన్ని చూసిన భారత అభిమానులు తీవ్రంగా స్పందించారు.

‘అశ్విన్‌ను అండర్సన్‌ అవమానించినప్పుడు, వీడ్కోలు పోరులో ఫిలాండర్‌ను బట్లర్‌ దూషించినప్పుడు నువ్వెక్కడున్నావు? నిజానికి బుమ్రా బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు ఇదంతా మొదలుపెట్టింది ఇంగ్లాడే కదా’ అని ఒకరు బదులిచ్చారు. అంతేకాకుండా ఇంగ్లాండ్‌ జట్టు బుమ్రాతో ప్రవర్తించిన తీరును షేన్‌వార్న్‌ సహా మాజీ క్రికెటర్లు తప్పుబట్టిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్‌ దిగ్గజాలే తమ జట్టు ఆటతీరును చూసి సిగ్గుపడుతున్నట్టు ప్రకటించారు!



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని