IND vs SA: టీమ్‌ఇండియా యువకులు ఎల్గర్‌ను చూసి నేర్చుకోవాలి

టీమ్‌ఇండియా వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌పై మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ నిప్పులు చెరిగాడు. ఇలా కాదు టెస్టు క్రికెట్‌ ఆడేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు...

Published : 07 Jan 2022 01:27 IST

ఇలా కాదు టెస్టు క్రికెట్‌ ఆడేది: గంభీర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌పై మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ నిప్పులు చెరిగాడు. ఇలా కాదు టెస్టు క్రికెట్‌ ఆడేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పంత్‌ మూడో రోజు ఆటలో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో వాండర్‌ డస్సెన్‌ (11)ను బ్యాటింగ్‌ చేస్తుండగా.. ‘నాలుగో స్థానంలో ఆడుతున్నావ్‌.. కానీ, ఎలా ఆడాలో తెలియదు’ అని రెచ్చగొట్టినట్లు తెలిసింది. దీనిపై స్పందించిన గంభీర్‌.. టీమ్‌ఇండియా యువకులు దక్షిణాఫ్రికా బ్యాటర్‌ డీన్‌ ఎల్గర్‌ను చూసి నేర్చుకోవాలన్నాడు.

‘ఇతరులపై స్లెడ్జింగ్‌కు పాల్పడటం చాలా తేలికైన పని. కానీ, అదే నువ్వు బ్యాటింగ్‌ చేసేటప్పుడు అలాంటి వాటిని ఎదుర్కోవడమే చాలా కష్టం. పంత్‌ రెండో ఇన్నింగ్స్‌లో వచ్చీ రాగానే భారీ షాట్‌కు వెళ్లకుండా.. నిలకడగా ఆడి జట్టుకు విలువైన పరుగులు అందించేందుకు ప్రయత్నించి ఉంటే మరింత సంతోషించేవాడిని. అతడి విషయంలో నేను తీవ్ర అసంతృప్తికి గురయ్యా అనే పదం వాడటం కూడా కష్టమే. ఎందుకంటే.. టెస్టు క్రికెట్‌ అనేది ఇలా కాదు ఆడేది. అందుకే నేను టీమ్‌ఇండియా యువకుల్ని ఎల్గర్‌ను చూసి నేర్చుకోమని అంటున్నా’ అని గంభీర్‌ అభిప్రాయపడ్డాడు. కాగా, టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్‌కు వచ్చిన పంత్‌ ఎదుర్కొన్న మూడో బంతికే భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. దీంతో అతడిపై విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే గంభీర్‌ సైతం అతడి ఆటతీరుపై తీవ్రంగా స్పందించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని