ICC T20 World Cup: టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్‌ విడుదల

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్‌ విడుదలైంది. అక్టోబర్‌ 17 నుంచి నవంబర్‌ 14 వరకు ఈ టోర్నీ జరగనుంది.

Updated : 17 Aug 2021 12:45 IST

కీలక మ్యాచులు ఎప్పుడంటే..!

అబుదాబి: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్‌ విడుదలైంది. అక్టోబర్‌ 17 నుంచి నవంబర్‌ 14 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఒమన్‌తో పాటు యూఏఈలో టీ20 ప్రపంచకప్‌ నిర్వహించనున్నారు. నవంబర్‌ 10, 11 తేదీల్లో సెమీఫైనల్‌.. నవంబర్‌ 14న ఫైనల్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. సెమీస్‌, ఫైనల్‌ మ్యాచ్‌లకు రిజర్వు డే కేటాయించారు. అక్టోబర్‌ 24న భారత్‌-పాక్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది.

తొలిరౌండ్లో గ్రూప్‌-బి నుంచి తొలి పోరు ఉంటుంది. అక్టోబర్‌ 17న మధ్యాహ్నం మ్యాచులో ఒమన్‌, పపువా న్యూగినీ తలపడతాయి. సాయంత్రం మ్యాచులో స్కాట్లాండ్‌, బంగ్లాదేశ్‌ ఢీకొంటాయి. ఆ తర్వాతి రోజు గ్రూప్‌-ఏలోని ఐర్లాండ్‌, నెదర్లాండ్స్‌, నమీబియా, శ్రీలంక అబుదాబిలో పోటీపడతాయి. ఇక అసలు సిసలైన సూపర్‌ 12 మ్యాచులు అక్టోబర్‌ 23 నుంచి మొదలవుతాయి.

సూపర్‌-12లో అబుదాబి వేదికగా గ్రూప్‌-1లోని ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా అక్టోబర్‌ 23న తలపడతాయి. సాయంత్రం మ్యాచులో ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌ను దుబాయ్‌లో ఢీకొంటుంది.  కీలకమైన ఆసీస్‌, ఇంగ్లాండ్‌ పోరు అక్టోబర్‌ 30న ఉండనుంది. గ్రూప్‌-2లో అతిపెద్ద మ్యాచ్‌ అక్టోబర్‌ 24న ఉంటుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు దుబాయ్‌లో భారత్‌, పాకిస్థాన్‌ ఢీకొంటాయి. అబుదాబిలో నవంబర్‌ 10న తొలి సెమీస్‌, దుబాయ్‌లో 11న రెండో సెమీస్‌ ఉంటాయి. నవంబర్‌ 14, ఆదివారం దుబాయ్‌లో ఫైనల్‌ పోరు ఉంటుంది. ఈ మూడు మ్యాచులకు రిజర్వు డేలు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని