Tokyo Olympics: భారత మహిళల హాకీ జట్టు ఆశలన్నీ బ్రిటన్‌పైనే

ఒలింపిక్స్ మహిళల హాకీ పోటీల్లో భారత జట్టు గ్రూప్‌-ఏలో చివరి మ్యాచ్‌ గెలిచి క్వార్టర్‌ ఫైనల్స్‌ ఆశలు సజీవంగా ఉంచుకుంది. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 4-3 తేడాతో విజయం సాధించింది...

Updated : 31 Jul 2021 17:05 IST

టోక్యో: ఒలింపిక్స్ మహిళల హాకీ పోటీల్లో భారత జట్టు గ్రూప్‌-ఏలో చివరి మ్యాచ్‌ గెలిచి క్వార్టర్‌ ఫైనల్స్‌ ఆశలు సజీవంగా ఉంచుకుంది. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 4-3 తేడాతో విజయం సాధించింది. దాంతో గ్రూప్‌ దశలో వరుసగా రెండో విజయం సాధించి ఆరు పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. అయితే, భారత జట్టు క్వార్టర్‌ ఫైనల్స్‌ చేరాలంటే నేటి సాయంత్రం వరకూ వేచి చూడాలి. గ్రూప్‌-ఏలో చివరి మ్యాచ్‌ ఐర్లాండ్‌, బ్రిటన్‌ మధ్య శనివారం సాయంత్రం జరగనుంది. అందులో బ్రిటన్‌ గెలిచినా లేదా మ్యాచ్‌ డ్రాగా ముగిసినా భారత్‌ తర్వాతి దశకు వెళ్తుంది. ఒక వేళ ఐర్లాండ్‌ గెలిస్తే ఇక్కడి నుంచే భారత్‌ నిష్క్రమించాల్సి ఉంటుంది. దీంతో భారత ఆశలన్నీ ఇప్పుడు బ్రిటన్‌పైనే ఉన్నాయి.

వందన అద్భుత ప్రదర్శన..

ఇక ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ ఒక్క పాయింట్‌తో ముందడుగు వేసింది. వందన కతారియా హ్యాట్రిక్‌ గోల్స్‌ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. భారత్‌ తరఫున ఒలింపిక్స్‌లో ఈ ఘనత సాధించిన తొలి హాకీ ప్లేయర్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. 4, 17, 49వ నిమిషాల్లో వరుసగా గోల్స్‌ నమోదుచేసింది. మరోవైపు నేహా గోయల్‌ 32వ నిమిషంలో ఇంకో గోల్‌ సాధించింది. అలాగే దక్షిణాఫ్రికా జట్టులో టారిన్‌ గ్లాస్బీ 15వ నిమిషంలో, ఎరిన్‌ హంటర్‌ 30వ నిమిషంలో, మారిజెన్‌ మారాస్‌ 39వ నిమిషంలో గోల్స్‌ సాధించి గట్టి పోటీనిచ్చారు. అయితే వందన 49వ నిమిషంలో చివరి గోల్‌ సాధించడంతో భారత్‌ విజయం సాధించింది.

మరోవైపు శుక్రవారం తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లోనూ భారత్‌ ఐర్లాండ్‌పై 1-0 తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. అంతకుముందు భారత జట్టు వరుసగా మూడు మ్యాచ్‌లు ఓటమిపాలై ఒలింపిక్స్‌ రేసులో వెనుకబడింది. కానీ ఇప్పుడు విజయాలు సాధిస్తుండటంతో క్వార్టర్స్‌కు చేరడంపై ఆశలు మొదలయ్యాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని