Published : 05 Oct 2021 15:22 IST

IPL 2021: ఇద్దరికీ చావో రేవో.. ఎవరు గెలుస్తారో చూడాలి!

రాజస్థాన్‌ x ముంబయి ప్రివ్యూ..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌ రేసులో నిలవాలంటే ముంబయి ఇండియన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ ఇకపై ఆడాల్సిన తమ తమ రెండు మ్యాచ్‌ల్లోనూ తప్పక గెలవాలి. ఈరోజు జరిగే 51వ మ్యాచ్‌లో ఈ రెండు జట్లూ పోటీపడుతుండగా ఎవరు గెలుస్తారనే విషయం ఆసక్తి కలిగిస్తోంది. గెలిచిన జట్టు ఒక అడుగు ముందుకేసి మరో మ్యాచ్‌ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొనగా.. ఓడిన జట్టు నిరాశతో టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పదు. అయితే, రాజస్థాన్‌ మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిస్తే నాలుగో స్థానంలో ప్లేఆఫ్స్‌ చేరుకునే అవకాశం ఉండగా.. ముంబయి మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలవడంతో పాటు కోల్‌కతా, రాజస్థాన్‌ ఫలితంపైనా ఆధారపడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్ల ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం.

రెండు జట్లు ఇంచుమించు అంతే..

యూఏఈలో జరుగుతున్న రెండో దశలో ముంబయి, రాజస్థాన్‌ జట్లు ఇంచుమించు ఒకేలా ఆడుతున్నాయి. రాజస్థాన్‌ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో మూడు ఓటములు, రెండు విజయాలతో కొనసాగుతుండగా.. ముంబయి నాలుగు ఓటములు ఒక విజయంతో ప్లేఆఫ్స్‌ రేసులో కొట్టుమిట్టాడుతోంది. అయితే, గత మ్యాచ్‌లో రాజస్థాన్‌.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఓడించడమే ఇప్పుడు ఆ జట్టుకు ఊరటనిచ్చే అంశంగా ఉంది. బలమైన ధోనీసేనపై విజయం సాధించడంతో సంజూ టీమ్‌ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. మరోవైపు ముంబయి గతవారం పంజాబ్‌ను ఓడించి గెలుపు బాటపట్టినా.. శనివారం దిల్లీతో తలపడిన వేళ మరోసారి మట్టికరిచింది. దీంతో రోహిత్‌ శర్మ జట్టుపై పెద్దగా అంచనాలు లేకుండాపోయాయి.

ముంబయి గెలవాలంటే..

ఈ సీజన్‌లో ముంబయి వైఫల్యానికి ప్రధాన కారణం బ్యాట్స్‌మెన్‌ సరిగ్గా ఆడకపోవడం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, క్వింటన్‌ డికాక్‌ మినహా మిగతా అందరూ విఫలమయ్యారు. వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ ఇషాన్‌ కిషన్‌ నుంచి లోయర్‌ మిడిల్‌ ఆర్డర్‌లో కీరన్‌ పొలార్డ్‌ వరకు ప్రతి ఒక్కరు బ్యాట్లకు పనిచెప్పలేక చతికిలపడ్డారు. అయితే, దిల్లీతో జరిగిన గత మ్యాచ్‌లో సూర్యకుమార్‌, హార్దిక్‌ పాండ్య కాస్త లయ అందుకున్నట్లు కనిపించారు. మధ్యలో వారిద్దరు పరుగులు చేయడంతో ముంబయి 129 పరుగుల సాధారణ స్కోరైనా సాధించింది. మరోవైపు బౌలింగ్‌లో పేసర్లు బుమ్రా, కౌల్టర్‌ నైల్‌, ట్రెంట్‌ బౌల్ట్‌ లాంటి ఆటగాళ్లు ఫర్వాలేదనిపిస్తున్నా కీలక స్పిన్నర్లుగా కొనసాగుతున్న కృనాల్‌ పాండ్య, రాహుల్‌ చాహర్‌ వికెట్లు తీయలేక సతమతమవుతున్నారు. వీళ్లంతా జట్టుగా రాణిస్తే తప్ప ముంబయి నేటి మ్యాచ్‌లో రాజస్థాన్‌ను ఓడించే పరిస్థితి లేదు.

రాజస్థాన్‌ నిలవాలంటే..

ఇక రాజస్థాన్‌ జట్టులో ప్రస్తుతం బ్యాట్స్‌మెన్‌ అంతా ఫామ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. చెన్నైతో తలపడిన గత మ్యాచ్‌లో ఆ జట్టు 190 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు ఎవిన్‌ లూయిస్‌, యశస్వి జైశ్వాల్‌ పూర్తి సానుకూల దృక్పథంతో కనిపిస్తున్నారు. వీరిద్దరూ చెన్నైతో మ్యాచ్‌లో ఐదు ఓవర్లలోనే 75 పరుగులు సాధించి జట్టుకు బలమైన పునాది వేశారు. ఆపై కెప్టెన్‌ సంజూ శాంసన్‌, ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబె ధాటిగా ఆడుతున్నారు. ఈ నలుగురు మరోసారి చెలరేగితే ముంబయికి కష్టాలు తప్పవనే చెప్పాలి. ఇక బౌలింగ్‌లో రాహుల్‌ తెవాతియా, చేతన్‌ సకారియా, ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌ మరింత కట్టుదిట్టంగా బంతులేస్తే ముంబయిని ఓడించడం పెద్ద కష్టమేమీ కాదు. ఇక ఇప్పటివరకు ఇరు జట్లు మొత్తం 25 మ్యాచ్‌ల్లో తలపడగా రాజస్థాన్‌ 12, ముంబయి 13 మ్యాచ్‌లు గెలుపొందాయి. ఇక ఈరోజు మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో ఎవరు ఇంటిముఖం పడుతారో వేచి చూడాలి.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్