Sachin on Rohit sharma: రోహిత్‌ బ్యాటింగ్‌.. ‘కొత్త కొత్తగా ఉన్నదీ!’

ఇంగ్లాండ్‌ పర్యటనలో సరికొత్త రోహిత్‌శర్మను చూస్తున్నానని టీమ్‌ఇండియా దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్‌ అన్నారు...

Published : 20 Aug 2021 13:25 IST

ముంబయి: ఇంగ్లాండ్‌ పర్యటనలో సరికొత్త రోహిత్‌శర్మను చూస్తున్నానని టీమ్‌ఇండియా దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్‌ అన్నారు. హిట్‌మ్యాన్‌ తన ఆటను మరోస్థాయికి తీసుకెళ్లాడని ప్రశంసించారు. బంతులు వదిలేయడం, డిఫెండ్‌ చేయడంలో పట్టుసాధించాడని తెలిపారు.

‘రోహిత్‌శర్మ జట్టును ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకున్నాడు. అతడి ఆటతీరును చూస్తే అలాగే అనిపించింది. ఎందుకంటే అతడు పరిస్థితులకు తగినట్టు తన ఆటను మార్చుకున్నాడు. తనలో మరోకోణాన్ని చూపించాడు’ అని సచిన్‌ అన్నారు.

హిట్‌మ్యాన్‌ పుల్‌షాట్ల బలహీనతపై సచిన్‌ స్పందించారు. అతడు ఔటైన విధానం కాకుండా జట్టుకు ఏం చేశాడన్నదే గమనించానని తెలిపారు. ‘బ్యాటింగ్‌ లైనప్‌కు రోహిత్‌ నాయకుడిగా ఉన్నాడు. కేఎల్‌ రాహుల్‌ అతడికి బాగా మద్దతిచ్చాడు. నిజానికి రోహిత్‌ పుల్‌షాట్లను అద్భుతంగా ఆడగలడు. ఆ షాట్లతో బంతిని అలవోకగా స్టేడియం దాటించగలడు. అతడెలా ఔటయ్యాడన్నది కాకుండా ఈ రెండు టెస్టుల్లో అతడు జట్టుకేం చేశాడన్నదే నేను చూస్తున్నాను’ అని మాస్టర్‌ అన్నారు.

‘రోహిత్‌లో సహనం పెరిగింది. ఓపికతో ఆడుతున్నాడు. నిజానికి అతడు బంతుల్ని చక్కగా వదిలేస్తున్నాడు. అవసరమైన బంతిని అద్భుతంగా డిఫెండ్‌ చేస్తున్నాడు. అతడో గొప్ప ఆటగాడు. ఇంగ్లాండ్‌లో రోహిత్‌ ఇన్నింగ్సులు చూసిన తర్వాత అతడి ఆట మరో స్థాయిని చేరుకుందని చెప్పగలను’ అని సచిన్‌ తెలిపారు. కాగా, హిట్‌మ్యాన్‌ ఇంగ్లాండ్‌పై రెండు టెస్టుల్లో 36, 12*, 83, 21 పరుగులతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని