
Tokyo Olympics: ఏం జరిగిందో అర్థంకాలేదు: దీపికా కుమారి
ఇంటర్నెట్‌డెస్క్: టోక్యో ఒలింపిక్స్ ఆర్చరీ పోటీల్లో ఏదో ఒక పతకం సాధిస్తుందని ఆశించిన భారత అగ్రశ్రేణి ఆర్చరీ క్రీడాకారిణి దీపికా కుమారి క్వార్టర్ ఫైనల్స్‌లో విఫలమై అందరినీ తీవ్ర నిరాశకు గురిచేసిన సంగతి తెలిసిందే. అయితే, తన ఓటమికి అధిక ఒత్తిడే కారణమని ఆమె పేర్కొంది. భవిష్యత్‌లో ఇలా కాకుండా కొత్త పద్ధతిలో ఒలింపిక్స్‌లో పాల్గొని మెరుగైన ఫలితాలను సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది. కాగా, ఆదివారం పూర్తైన టోక్యో ఒలింపిక్స్‌లో దీపికా మహిళల ఆర్చరీ వ్యక్తిగత విభాగంతో పాటు మిక్స్‌డ్ పెయిర్ విభాగంలోనూ పోటీపడి కీలక సందర్భాల్లో బోల్తాకొట్టింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె తన వైఫల్యానికి గల కారణాలతో పాటు తన అనుభవాలు కూడా మీడియాతో పంచుకుంది. తాను పోటీల్లో పాల్గొన్నప్పుడు ఉన్నట్టుండి ఏం జరిగిందో కూడా అర్థంకాలేదని చెప్పింది.
‘ప్రతి ఒక్కరూ మనకు పతకం రాలేదు.. రాలేదు అని అంటుంటారు. దాంతో మేం పతకం గురించి వెయ్యిసార్లు ఆలోచిస్తాం. దాని వల్ల మా మానసిక స్థైర్యం దెబ్బతింటుంది. దాంతో ఒత్తిడి పెరిగి అది మా నైపుణ్యాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది పక్కనపెడితే.. ఈ ఒలింపిక్స్‌లో నా ఆటతీరును ఒక అంచనా వేశాను. ఇప్పుడు దాన్ని మరో విధంగా చూస్తున్నాను. దాంతో మేం కొన్ని ప్రాథమిక విషయాలపై దృష్టిసారించాలని తెలిసొచ్చింది. మేం ఆడే విధానంలో మార్పులు చేసుకోవాలని అనిపించింది. మనం ప్రతి ఒక్క ఈవెంట్‌ను ఒకే విధంగా చూడాలి. అది ప్రపంచకప్ అయినా, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లైనా, లేదా ఒలింపిక్స్ అయినా. అన్నింటినీ ఒకేలా చూడాలి. కానీ, మనం ఒలింపిక్స్‌కు వచ్చేసరికే పతకం గురించి ఎక్కువ ఆలోచిస్తాం. అలా కాకుండా దాన్ని తేలిగ్గా తీసుకొని ఆటను మాత్రమే ఆస్వాదించాలి. మనకు ప్రపంచకప్, ప్రపంచ ఛాంపియన్‌షిప్పుల్లో పతకాలు ముఖ్యమే అయినా, వాటి గురించి పెద్దగా ఆలోచించం. అదే ఒలింపిక్స్‌కు వచ్చేసరికి ఎలాగైనా పతకం సాధించాలని బలంగా కోరుకుంటాం’ అని దీపికా వివరించింది.
ఈ క్రమంలోనే తాను పోటీల్లో పాల్గొనప్పుడు విశ్రాంతి సమయంలో ప్రశాంతంగా ఉండాలనుకున్నట్లు చెప్పింది. అయితే, ఆ సమయంలో ఉన్నట్టుండి అక్కడ ఏం జరిగిందో తనకు అర్థంకాలేదని దీపిక పేర్కొంది. ఆ సమయంలో ఆమె పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నానని, గురిచూసి బాణాలు విసురుతున్నా అవి లక్ష్యాన్ని చేరుకోలేకపోయాయని దీపికా స్పష్టం చేసింది. అదో అంతుబట్టని రహస్యంగా మిగిలిపోయిందని చెప్పింది. దాంతో తానూ, తన కోచ్ దిక్కుతోచని స్థితిలో పడిపోయినట్లు ఆమె వెల్లడించింది. మరోవైపు తన భర్త అతాను దాస్ కూడా పురుషుల విభాగంలో విఫలమవడంతో దీపికా విచారం వ్యక్తం చేసింది. తమ ఇద్దరికి అప్పుడొక మానసిక నిపుణుడు అవసరం అయ్యుండేదని, తమని మాటలతో స్ఫూర్తి నింపే వ్యక్తి కావాల్సి ఉండేదని తెలిపింది. ఇక చివరగా ఈ ఒలింపిక్స్‌లో విజేతలుగా నిలిచిన వారికి దీపికా అభినందనలు తెలిపింది. నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించడం గర్వకారణమని ప్రశంసించింది. తాను కూడా పతకం సాధించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.