Ranji: ఆ ఓటమికి కెప్టెన్‌దే తప్పన్న కోచ్‌.. దినేశ్‌ కార్తిక్‌ ఆగ్రహం

Dinesh Karthik: రంజి సెమీస్‌లోతమిళనాడు ఓటమిపై ఆ జట్టు కోచ్‌ చేసిన వ్యాఖ్యలను భారత క్రికెటర్‌ దినేశ్‌ కార్తిక్‌ తప్పుబట్టాడు. అలా మాట్లాడటం తప్పన్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?

Published : 05 Mar 2024 11:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రంజి ట్రోఫీ సెమీఫైనల్‌ (Ranji Semifinal) మ్యాచ్‌లో తమిళనాడు (Tamilnadu) ఘోరంగా ఓటమిపాలైంది. అద్భుతమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని చిత్తు చేసి ముంబయి (Mumbai) ఫైనల్‌ పోరుకు దూసుకెళ్లింది. మ్యాచ్‌ అనంతరం ఈ ఓటమిపై తమిళనాడు జట్టు కోచ్‌ సులక్షణ్‌ కులకర్ణి మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కెప్టెన్‌ నిర్ణయం వల్లే ఓడిపోవాల్సి వచ్చిందన్నారు.

‘‘నేను ఏదైనా సూటిగా చెప్తా. మేం ఈ మ్యాచ్‌ను తొలి రోజు ఉదయం 9 గంటలకే కోల్పోయాం. ఒక కోచ్‌, ముంబయి వాసిగా ఇక్కడి పిచ్‌ పరిస్థితులేంటో నాకు తెలుసు. అందుకే టాస్‌ గెలిస్తే బౌలింగ్‌ ఎంచుకోవాలని మేం మానసికంగా సిద్ధమయ్యాం. కానీ, కెప్టెన్‌ భిన్నంగా ఆలోచించాడు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ తీసుకున్నాడు. బౌలింగ్‌కు అనుకూలమైన పరిస్థితులు ఉండటంతో తొలి ఇన్నింగ్స్‌లో మేం వెనువెంటనే వికెట్లు కోల్పోయాం’’ అని కులకర్ణి వెల్లడించారు.

అయితే ఈ వ్యాఖ్యలను భారత క్రికెటర్‌ దినేశ్‌ కార్తిక్‌ (Dinesh Karthik) తప్పుబట్టాడు. ‘‘ఇది చాలా తప్పు. కోచ్‌ మాటలు అసంతృప్తినిచ్చాయి. ఏడేళ్ల తర్వాత జట్టును సెమీస్‌ దాకా తీసుకొచ్చిన కెప్టెన్‌కు కోచ్‌ అండగా నిలవాలి. మంచి జరుగుతుందని ప్రోత్సాహం ఇవ్వాలి. అంతేగానీ, ఇలా స్వార్థపూరితంగా తప్పందా కెప్టెన్‌, జట్టు మీద తోసెయ్యకూడదు’’ అని డీకే సోషల్‌ మీడియాలో అసహనం వ్యక్తం చేశాడు.

సెమీస్‌లో తొలి ఇన్నింగ్స్‌లో తమిళనాడు 146కే ఆలౌట్‌ అవ్వగా.. ముంబయి 353 పరుగులతో భారీ ఆధిక్యం దక్కించుకుంది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో తమిళనాడును ముంబయి బౌలర్లు బెంబేలెత్తించడంతో 164 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా ఇన్నింగ్స్‌ 70 పరుగుల తేడాతో ముంబయి ఫైనల్‌కు వెళ్లింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని