Tilak Varma: తిలక్‌ వర్మను వన్డే ప్రపంచ కప్‌ జట్టులోకి తీసుకోవాలి: అశ్విన్

విండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో అదరగొడుతున్న తిలక్ వర్మ (Tilak Varma) వన్డే ప్రపంచ కప్‌ జట్టులోకి తీసుకోవాలని భారత స్పిన్నర్ అశ్విన్‌ సెలక్టర్లను కోరాడు.

Published : 10 Aug 2023 15:50 IST

ఇంటర్నెట్ డెస్క్: తిలక్‌ వర్మ (Tilak Varma).. భారత క్రికెట్‌ వర్గాల్లో ఇప్పుడు ఎక్కడ చూసిన ఇదే పేరు వినిపిస్తోంది. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ తరఫున అదరగొట్టి విండీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైన ఈ హైదరాబాదీ కుర్రాడు.. అంతర్జాతీయ కెరీర్‌ను ఘనంగా ఆరంభించాడు. వరుసగా 39, 51, 49 నాటౌట్‌గా నిలిచి మరోసారి అందరి చూపును తనపక్కకు తిప్పుకొన్నాడు. తనకన్నా సీనియర్‌ విఫలమైన వేళ తిలక్‌ అలవోకగా భారీ షాట్లు ఆడాడు. దీంతో 20 ఏళ్ల కుర్రాడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. టీమ్‌ఇండియాకు వివిధ ఫార్మాట్లలో దీర్ఘ కాలం ఆడగల సత్తా ఉందని పలువురు మాజీలు పేర్కొన్నారు. 20 ఏళ్ల తిలక్‌ను అక్టోబరులో మొదలయ్యే ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్‌ (World Cup 2023) జట్టులోకి తీసుకోవాలని సెలక్టర్లకు సూచిస్తున్నారు. భారత సీనియర్ స్పిన్నర్‌ రవిచంద్రన్ అశ్విన్‌ (Ravichandran Ashwin) కూడా తిలక్‌ వర్మ వరల్డ్ కప్‌ జట్టులోకి తీసుకోవాలని సెలక్టర్లను కోరాడు. అశ్విన్ వ్యాఖ్యలను టీమ్‌ఇండియా మాజీ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌ సమర్థించాడు.

టీమ్‌ ఇండియాలో ఎంపిక గురించి ఆలోచించడంలేదు: పృథ్వీషా

తిలక్ వర్మపై విశ్వాసం ఉంచాలని, జట్టు మిడిలార్డర్‌ సమస్యలకు అతడు పరిష్కారం చూపగలడని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ‘‘ప్రపంచ కప్‌ జట్టులో చోటు తీవ్రమైన పోటీ ఉంది. మీకు బ్యాకప్‌ ఆటగాళ్లు లేకపోతే తిలక్‌ వర్మను ఆప్షన్‌గా పరిగణనలోకి తీసుకోవచ్చు. ఎందుకంటే టీమ్‌ఇండియాకు లెప్ట్‌హ్యాండ్‌ బ్యాటర్ల కొరత ఉంది. టాప్‌-7లో రవీంద్ర జడేజా ఒక్కడే ఎడమ చేతివాటం బ్యాటర్‌. తిలక్‌ వర్మను ఇబ్బంది పెట్టే నాణ్యమైన ఆఫ్‌ స్పిన్నర్‌లు ఏ టాప్‌ టీమ్‌లో లేరు. అందుకే ప్రపంచకప్‌లో అతడు కీలకమవుతాడు. తిలక్ కచ్చితంగా వరల్డ్ కప్‌ జట్టు పరిశీలనలో ఉంటాడు. అతడి ఆటను చూసిన ఏ సెలక్టర్ అయినా ‘వావ్!’ అంటాడు’’ అని అశ్విన్‌ పేర్కొన్నాడు. శ్రేయస్‌ అయ్యర్‌ గాయం నుంచి కోలుకపోతే ప్రపంచ కప్‌ జట్టులో తిలక్ ఉండే అవకాశాలు ఉన్నాయని ఎమ్మెస్కే ప్రసాద్ పేర్కొన్నాడు. అతడికి వన్డేల్లో కూడా ఆడే సత్తా ఉందన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని