Tilak Varma: ఆసియా కప్‌నకు ఎంపికైనందుకు సంతోషంగా ఉంది.. అక్కడ కూడా రాణించాలనుకుంటున్నా: తిలక్ వర్మ

ఆసియా కప్‌నకు ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉందని, అక్కడ కూడా బాగా రాణించాలనుకుంటున్నానని టీమ్‌ఇండియా యువ బ్యాటర్‌ తిలక్ వర్మ (Tilak Varma) పేర్కొన్నాడు. 

Published : 22 Aug 2023 16:03 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆగస్టు 30 నుంచి ఆసియా కప్ 2023 (Asia Cup 2023) ప్రారంభంకానుంది. ఆరు దేశాలు పాల్గొనే ఈ మినీ టోర్నీ కోసం టీమ్ఇండియా నిన్న (ఆగస్టు 21న) జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ (Rohit Sharma) కెప్టెన్‌గా 17 మందితో కూడిన జట్టులో హైదరాబాదీ కుర్రాడు తిలక్‌ వర్మ (Tilak Varma) చోటు దక్కించుకున్నాడు. ఆసియా కప్‌నకు ఎంపికకావడంపై తిలక్ వర్మ హర్షం వ్యక్తం చేస్తూ.. తనకు మద్దతుగా నిలిచి నమ్మకం ఉంచిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు కృతజ్ఞతలు తెలిపాడు. ఐపీఎల్‌లో రోహిత్ సారథ్యంలోని ముంబయి ఇండియన్స్‌ తరఫున గత రెండు సీజన్లలో తిలక్ వర్మ అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రోహిత్‌, తిలక్‌కు మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు వచ్చి జట్టును ఆదుకోవడం హిట్‌మ్యాన్‌ను ఎంతో ఆకర్షించింది. రోహిత్ శర్మ తనకు ఎల్లప్పుడూ ఎలా మద్దతుగా నిలిచాడు, ఎలా ప్రోత్సాహించాడు అనే విషయాలను తిలక్ వర్మ తాజాగా బీసీసీఐ చేసిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

ఆ ఐదు సిక్స్‌లు నా జీవితాన్ని మార్చేశాయి: రింకూ సింగ్

‘‘రోహిత్ భయ్యా ఎల్లప్పుడూ నాకు మద్దతుగా నిలిచాడు. నేను ఐపీఎల్‌లో ఆడుతున్నప్పుడు కూడా అతను నా దగ్గరకు వచ్చి మాట్లాడేవాడు. నా ఐపీఎల్‌లో కెరీర్‌ ప్రారంభ దశలో కొంచెం భయపడ్డాను. దీంతో రోహిత్‌ శర్మ స్వయంగా నా దగ్గరకు వచ్చి ఆట గురించి మాట్లాడాడు. ఎల్లప్పుడూ నీ ఆటను ఆస్వాదించు, ఒత్తిడి లేకుండా ఫ్రీగా ఉండు అని ఎంకరేజ్‌ చేశాడు. నువ్వు ఎప్పుడు మాట్లాడాలనుకున్నా నా దగ్గరికి ఏ సమయంలోనైనా రావచ్చు లేదా మెసేజ్ చేయొచ్చు. నేను నీకు అండగా ఉంటానని రోహిత్ చెప్పాడు. అతనితో తరచూ మాట్లాడతా. ఐపీఎల్‌లో నా ఆటతీరును ప్రదర్శించా. ప్రతిచోటా అలాగే ఆడతా. ఆసియా కప్‌నకు ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉంది. అక్కడ కూడా బాగా రాణించాలనుకుంటున్నా’’ అని తిలక్ వర్మ వివరించాడు. ఇటీవల వెస్టిండీస్‌తో ముగిసిన ఐదు టీ20ల సిరీస్‌లో తిలక్ వర్మ 173 పరుగులు చేశాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో 30 కంటే ఎక్కువ పరుగులు సాధించి సెలక్టర్ల దృష్టిలో పడి ఆసియా కప్‌నకు ఎంపికయ్యాడు. అతడు ఆసియా కప్‌లోనూ సత్తా చాటితే వన్డే ప్రపంచకప్‌ జట్టులో ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని