Australia: అద్భుత ప్రదర్శనతో సవాళ్లను వెనక్కినెట్టి.. అన్ని జట్లనూ ఓడించి..

ఆస్ట్రేలియా ఆరో సారి ప్రపంచకప్‌ అందుకుంది. ఆరు అనేది కేవలం సంఖ్య మాత్రమే కాదు.. అంతకుమించి.

Updated : 20 Nov 2023 07:20 IST

స్ట్రేలియా (Australia) ఆరో సారి ప్రపంచకప్‌ (Icc World Cup) అందుకుంది. ఆరు అనేది కేవలం సంఖ్య మాత్రమే కాదు.. అంతకుమించి. ఈ ఘనత వెనుక ఆసీస్‌ ఆటగాళ్ల కష్టం ఉంది. పట్టుదలతో ఒడుదొడుకులను దాటి.. అద్భుత ప్రదర్శనతో సవాళ్లను వెనక్కినెట్టి.. మరే జట్టుకూ సాధ్యం కాని రీతిలో ఆ జట్టు విశ్వవిజేతగా నిలిచింది. కంగారూ జట్టు ఈ టోర్నీని ఆరంభించిన దానికి, ముగించిన దానికి పొంతనే లేదు. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటములే. భారత్‌ (India), దక్షిణాఫ్రికా (South Africa) చేతుల్లో పరాజయాలు చవిచూసింది. కానీ మూడో మ్యాచ్‌లో శ్రీలంక (Sri Lanka) పై విజయం తర్వాత ఆ జట్టు ఆగలేదు. గెలుపు రుచి చూసిన ఆసీస్‌.. కప్పు ముద్దాడే వరకూ విశ్రమించలేదు. వరుసగా పాకిస్థాన్‌, నెదర్లాండ్స్‌, న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్‌, అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌లపై గెలిచి సెమీస్‌ చేరింది. ప్రపంచకప్‌ నాకౌట్లో తామెంత ప్రమాదకరమో చాటుతూ సెమీస్‌, ఫైనల్లో విజయాలు అందుకుంది. అంతే కాదు లీగ్‌ దశలో తనను ఓడించిన జట్లపైనే నాకౌట్లో గెలిచి లెక్క సరిచేస్తూ.. అసలైన విజేతగా నిలిచింది. దక్షిణాఫ్రికాతో సెమీస్‌లో 213, భారత్‌తో ఫైనల్లో 241 పరుగుల లక్ష్యఛేదనలో క్లిష్ట పరిస్థితులు ఎదురైనా ఆ జట్టు పట్టుదలగా నిలబడింది. చివరి వరకూ ఓటమిని ఒప్పుకోని వ్యక్తిత్వంతో, ఆఖరి బంతి వరకూ పోరాడే తత్వంతో విజయభేరి మోగించింది. ముఖ్యంగా అజేయంగా ఫైనల్‌ చేరిన భారత్‌పై నెగ్గి సగర్వంగా కప్పు అందుకుంది.

నాకౌట్‌ నిరాశ

ఐసీసీ ట్రోఫీల్లో నాకౌట్‌ గండం టీమ్‌ఇండియాను వెంటాడుతూనే ఉంది. 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలిచిన తర్వాత జరిగిన ఐసీసీ టోర్నీల్లో భారత్‌ 9 సార్లు నాకౌట్‌లోనే నిష్క్రమించింది. ఇందులో 5 ఫైనళ్లు, 4 సెమీస్‌లున్నాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో వరుసగా రెండు ఫైనల్లో (2021, 2023)నూ టీమ్‌ఇండియా ఓడింది. 2014 టీ20 ప్రపంచకప్‌, 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ, 2023 వన్డే ప్రపంచకప్‌లోనూ ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. రెండు సార్లు వన్డే ప్రపంచకప్‌ (2015, 2019), టీ20 ప్రపంచకప్‌ (2016, 2022)లో సెమీస్‌లోనే ఇంటి ముఖం పట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని